మున్సిపల్‌ కమిషనర్‌పై కౌన్సిలర్‌ ఆగ్రహం

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

పబ్లిక్‌ సర్వెంటా? లేక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సర్వెంటా? ఎలా పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలని మున్సిపల్‌ కమిషనర్‌ భవానీప్రసాద్‌ను స్థానిక 19వ వార్డు కౌన్సిలర్‌ ఇందిరా ప్రియదర్శిని నిలదీశారు. గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు ప్రజాసమస్యలపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా ప్రియదర్శిని తనవార్డులో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై తనకు సమాచారం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 19వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ కాలుష్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ప్రజలు చనిపోయే వరకూ చూస్తూ ఉంటారా అని ప్రశ్నించారు. అలాగే హై స్కూల్‌ సెంటర్‌ వద్ద తొలగించిన సావిత్రిబాయి పూలే విగ్రహం తిరిగి ఏర్పాటు చేయాలని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ స్పందిస్తూ ఏ విషయమైనా కేవలం చైర్‌పర్సన్‌ ఆదేశాలు మాత్రమే పాటిస్తామని బదులిచ్చారు. సమస్యలు ఏమైనా ఉంటే కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌తో మాత్రమే చర్చించాలన్నారు. ఆనంతరం నాలుగో వార్డు కౌన్సిలర్‌ వలవల తాతాజీ మాట్లాడుతూ తన వార్డు సమస్యలపై మున్సిపల్‌ అధికారులకు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అధికారులు అధికారపార్టీకి చెందిన నాయకులు చెప్పగానే వచ్చి పనులు పూర్తిచేస్తున్నారన్నారు. కౌన్సిలర్‌గా తన చేతగాని తనమా అంటూ ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పట్టణంలో అత్యవసర సమస్యలకు ప్రాధాన్యతిస్తూ పనులు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్‌ సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండాపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️