మున్సిపల్‌ కార్మికుల కలెక్టరేట్‌ ముట్టడి

Jan 8,2024 21:55

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు, ఎస్‌ఐ అశోక్‌ పర్యవేక్షణలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుపోయి 16 మంది సిఐటియు నాయకులను, కార్మికులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు, యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు కడుపు మండి 14 రోజులుగా సమ్మె చేస్తే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని అన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న జీతం, ఆరోగ్య భృతి కలిపి రూ.21వేలు జీతంగా చెల్లిస్తామని ప్రకటించారని దీనివల్ల కార్మికులకు కలిగే ప్రయోజనం లేదని, మరో రూ.3వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌, వాటర్‌ వర్క్స్‌, పంప్‌ హౌస్‌ కార్మికుల సమస్యలను దాటవేశారని, జీవో నెంబర్‌ 30ను సవరించి స్కిల్డ్‌, సెమిస్కిల్డు , అన్‌ స్కిల్‌ వేతనాలతో పాటుగా రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, పంపు హౌస్‌ కార్మికులకు మెన్‌, మెటీరియల్‌ వేరు చేసి ఆప్కాస్‌ జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ముట్టడికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.త్రినాధ్‌ మద్దతు తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో పి.శంకర్రావు, ఎ.జగన్మోహన్‌తో పాటు కిల్లంపల్లి రామారావు, భాస్కరరావు, బాబురావు, గౌరీ, రామారావు, కుమారి, రమా, గౌరీ , నాగమ్మ, రాధ, దుర్గారావు, హరిబాబు, శ్రీను, గౌరీ, తదితరులు ఉన్నారు. ముట్టడిలో రాజాం ,బొబ్బిలి, నెల్లిమర్ల ,విజయనగరం మున్సిపల్‌ కార్మికులతో పాటు ఇంజినీరింగ్‌ విలీన ప్రాంత కార్మికులు పాల్గొన్నారు.

➡️