మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 30,2024 19:01
ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
మున్సిపల్‌ కార్మికుల నిరసన
ప్రజాశక్తి-నెల్లూరురాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మునిసిపల్‌ కార్మికులు సమ్మె బాటపట్టిన సమయంలో ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో మంత్రుల బందం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తక్షణమే అందుకు సంబంధించిన జివో విడుదల చేయాలని ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఆ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్పోరేషన్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పోరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని కార్మికులకు నైపుణ్యం, అర్ధ నైపుణ్యం జీతాలను సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ( సిఐటియు ) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పోరేషన్‌ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మరమ్మత్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మునిసిపల్‌ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలన్నారు. నగరపాలక సంస్థలో చట్ట ప్రకారం అమలు చేయాల్సిన పండుగ సెలవులు, కార్మికులందరికీ బ్యాంకు రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని, చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా అందజేయడంతోపాటు, వారి వారసులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరిగిన సందర్భంలో మంత్రుల బందం కార్మిక సంఘాలతో చర్చించి పలు సమస్యలపై పరిష్కరిస్తానని హామీలు ఇచ్చిన తరువాతనే సమ్మె విరమించడం జరిగిందని అన్నారు. సమ్మె విరమించి 20 రోజులు పూర్తవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీల అమలు కోసం జీవోలు జారీ చేయకపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలోని కార్మికులకు నైపుణ్యం మరియు అర్ధ నైపుణ్యం జీతాలను సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా అనుభవం ఆధారంగా జీతాలు ఇవ్వడానికి కమిటీని ఏర్పాటు చేశారని సంబంధిత కమిటీ కూడా నత్తనడకన కొనసాగడం విచారకరమని అన్నారు. గతంలో ఇదే తరహాలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి పర్మినెంట్‌ చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మినెంట్‌ చేయకుండా మున్సిపల్‌ కార్మికుల్ని మోసం చేశారని అన్నారు. మున్సిపల్‌ కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే, ఇచ్చిన హామీల ప్రకారం తక్షణమే జీవోలు విడుదల చేయకపోతే పోరాటం మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు నగర పాలక సంస్థలో చట్ట ప్రకారం అమలు కావలసిన పండుగ సెలవులు అమలు చేయడం లేదని అన్నారు. కమిషనర్‌ చెప్పినప్పటికీ క్రింది స్థాయి అధికారులు ఉత్తర్వులు జారీ చేయకపోవడం విచిత్రంగా ఉందని అన్నారు. మున్సిపల్‌ కార్మికులు అధిక వడ్డీలతో,అప్పల తో సతమతమ వుతున్నారని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి ఉపశమనం కలిగించాలని కోరారు. చని పోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా, వారి వారసులకు ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు సునీల్‌ కుమార్‌, ఎం.అశోక్‌, కామాక్షమ్మ,భాగ్యమ్మ, కొండమ్మ,లోకేష్‌,భారతి,ఎం శ్రీనివాసులు,బాలు,కష్ణ,ముని మోహన్‌ బాబు,మహేష్‌,దయాకర్‌,మరియన్న తదితరులు పాల్గొన్నారు.

➡️