ముసాయిదా ఓటర్ల జాబితా సంతప్తికరం

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా సంతప్తికరమని అన్నమయ్య జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా-2024 సంబంధించి అన్నమయ్య జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు కలెక్టర్‌ గిరీషకలిసి ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీష జిల్లాలో చేపడుతున్న ముసాయిదా ఓటర్ల జాబితా – 2024 గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలకుడికి వివ రించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు, మండలాలు, 2024 కు జనాభా అంచనా, తదితర అంశాలను వివరించారు. జిల్లాలో 2024కు అంచనా జనాభా 19,77,882 మంది ఉంటారని, జిల్లాలో నవంబర్‌ 29 నాటికి ఈపీ రేషియో 694 ఉందని, స్త్రీ పురుష నిష్పత్తి 1032 గా ఉందని వివరించారు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1607 పోలింగ్‌ స్టేషన్స్‌ ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు కేటాయించిన ఇఆర్‌ఒల విధి విధానాలను తెలియజేశారు. జిల్లాలో 1297 మంది విధి నిర్వహణలో ఉన్న ఓటర్ల జాబితా గురించి వివరించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో కొత్తగా చేరిన ఓటర్ల జాబితా, తొలగించిన ఓటర్ల జాబితా గురించి వివరిస్తూ జిల్లాలో కొత్తగా చేరిన ఓటర్లు 62128 అని, తొలగించిన ఓటర్లు 58008 అని తెలిపారు. జిల్లాలో పోలింగ్‌ బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించినట్లుగా కలెక్టర్‌ ఆయనకు వివరించారు. జిల్లాలో నమోదైన అభ్యంతరాలను డిసెంబర్‌ 26 నాటికి క్లియర్‌ చేస్తామని, తుది జాబితాను 2024 జనవరి 5 నాటికి ప్రచురితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయనకు వివరించారు. ఇంటి నెంబరు సున్నా లేదా ఇతర జంక్‌ నెంబర్లు ఉన్న ఓటర్ల జాబితా, ఒక ఇంటికి పది అంతకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న జాబితా తదితర అంశాలను వివరించారు. డిఎన్‌ఇలు, పిఎస్‌ఇల జాబితా గురించి, వాటికి సంబంధించిన ఫామ్‌ ఏ గురించి వివరించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ బూత్‌ లెవెల్‌ అధికారిని సస్పెండ్‌ చేసినట్టుగా తెలిపారు. అలాగే 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ఓటర్లను చైతన్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాలలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గల పోలింగ్‌ స్టేషన్లను గురించి వివరిస్తూ గ్రామీణ ప్రాంతాలలో 1378 పోలింగ్‌ స్టేషన్లు, పట్టణ ప్రాంతాలలో 229 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లుగా తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓటర్ల తొలగింపు జాబితా ఎప్పటికప్పుడూ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పరిశీలకుడికి కోరారు. జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా గురించి సంతప్తి వ్యక్తం చేశారు. వారం వారం రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్నారని, దీనిని ఇలాగే కొనసాగించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్‌ జరగక ముందే ఓటర్ల జాబితా సరిగా ఉందా లేదా అనేది చూసుకోవడం, పోలింగ్‌ స్టేషన్లు ఎలక్షన్‌ కమిషన్‌ విధి విధానాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయని తెలిపారు. బిఎల్‌ఒలు ప్రజలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎటువంటి అవగాహన లోపం ఉండకూడదని సూచించారు. బిఎల్‌ఒలకు శిక్షణలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫార్మ్‌ 6కి సంబంధించి పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా క్లియర్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తారని, పక్షపాతం చూపిస్తే ఎలక్షన్‌ కమిషన్‌ ఊరుకోదని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు ఓటర్ల జాబితా పరిశీలకుల సూచనలను దష్టిలో పెట్టుకొని విధులను నిర్వర్తించాలన్నారు. ఇందులో ఏమైనా లోపాలుంటే సహించేది లేదని, కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్డీవోలు రంగస్వామి, మురళి, రామకష్ణారెడ్డి, ఎస్‌డిసి శ్రీలేఖ, వివిధ మండలాల తహశీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️