మూడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

ప్రజాశక్తి-తెనాలి : మూడేళ్ల చిన్నారికి అమెరికన్‌ ఆంకాలజీ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. అత్యాధునిక శస్త్రచికిత్స విధానంతో గుంటూరు జిజిహెచ్‌లో మంగళవారం మెదడులో ఉన్న దాదాపు ఐదంగుళాల కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతంపై అమెరికన్‌ ఆంకాలజి ఇనిస్టిట్యూట్‌ కన్సల్టెంట్‌ రేడియాలజి ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ కె.సుధాకర్‌, రీజినల్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మహేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన చిన్నారి తరచుగా వాంతులు, తలనొప్పితో బాధపడుతోంది. ఆమెకు ఎమ్మారై స్కానింగ్‌, ఇతర వైద్య పరీక్షల ద్వారా మెడడులో 4.44 అంగుళాల కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దానికి అమెరికన్‌ ఆంకాలజి ఇనిస్టిట్యూట్‌ కన్సల్టెంట్‌ రేడియాలజి ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ కె.సుధాకర్‌ ‘అనాప్లాస్టిక్‌ అపెండిమోమో’గా గుర్తించారు. దానికి శస్త్రచికిత్స అనివార్యంగా భావించి ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ కె.సుధాకర్‌ బృందంతోపాటు, డాక్టర్‌ సాయిబాబు అనస్థీషియా సహకారంతో శస్త్రచికిత్స నిర్వహించి, కణితిని తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ హాల్పియోన్‌ లీనియర్‌ యాక్సలరేటర్‌ అద్యాధునిక చికిత్స విదానంలో కణితిని తొలగించామన్నారు. ఆ కణితి మనిషిలోని కేంద్ర నాడీ వ్యవస్థ కణాలపై పనిచేస్తుందని, ఫలితంగా మెదడుతోపాటు వెన్నుపాము కూడా ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఈ శస్త్రచికిత్స ద్వారా క్లిష్టమైన అవయవాలు రేడియేషన్‌ ప్రభావానికి గురికావడాన్ని తగ్గించి, మెరుగైన ఆరోగ్యాన్ని అందించటం జరుగుతుందన్నారు. రీజినల్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అమెరికన్‌ ఆంకాలజి ఇనిస్టిట్యూట్‌లో అసాధారణమైన రీతిలో చికిత్సను అందించటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్య బృందంపై ఆధారపడుతున్నట్లు చెప్పారు. చిన్నారికి సవాలుతో కూడిన శస్త్రచికిత్సను నిర్వహించి విజయం సాధించామన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్యబృందాన్ని అభినందించారు. కేన్సర్‌ సంబంధిత వ్యాధుల బాధితులు ఎవరైనా అమెరికన్‌ ఆంకాలజి ఇనిస్టిట్యూట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️