మొబైల్‌ టవర్లతో డిజిటల్‌ విప్లవం

Jan 25,2024 20:59

 ప్రజాశక్తి – కురుపాం/గుమ్మలక్ష్మీపురం  :  సెల్‌టవర్ల ఏర్పాటుతో డిజిటల్‌ విప్లవం రానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ గంగన్నదొరవలస, జియ్యమ్మవలస మండలం పిటి మండ గిరిజన గ్రామాల్లో నిర్మించిన మొబైల్‌ టవర్లను గురువారం వర్చువల్‌ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టవర్ల ఏర్పాటుతో డిజిటల్‌ విప్లవం వచ్చి గొప్ప మార్పునకు నాంది పలకనుందని, యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ కింద రాష్ట్రంలో నిర్మించిన దాదాపు 4 వందల టవర్లను రూ.3119 కోట్లతో 2900 టవర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఏడాదిలో అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ మొబైల్‌ టవర్ల ఏర్పాటుతో జిల్లాలో నూతన శకం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4జి కవరేజ్‌ వస్తూ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన 60 టవర్లకు అటవీ అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. జిల్లాలో 196 టవర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని, తద్వారా దాదాపు 40వేల మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. టవర్ల ఏర్పాటు ఈ ప్రాంతానికి ఒక వరం లాంటిదన్నారు. జిల్లా యంత్రాంగం నుండి క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందితో బాగా అనుసంధానం జరుగుతోందని, పౌరులు తమ బంధువులతో అనుసంధానంతో ఎంతో ప్రయోజనం కలుగతుందని తెలిపారు. అత్యవసర సమయంలో మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేయవచ్చని, అలాగే ప్రజలు పథకాలకు దగ్గర అవుతున్నారని, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సైతం తమ సమస్యలు సులభంగా ఫోన్‌ ద్వారా తెలియజేయగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, టిపిఎంయు ఎపిడి వై.సత్యంనాయుడు, ఎంపిడిఒ ఎస్‌. అప్పారావు, వివిధ శాఖల మండలాల అధికారులు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️