మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలి

పొలసానిపల్లి సర్పంచి షేక్‌ రహీమా బేగం

ప్రజాశక్తి – భీమడోలు

ధాన్యం కొనుగోలులో సడలించిన నిబంధనలకు అదనంగా మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని పొలసానిపల్లి గ్రామ సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన కోరారు. తుపాను తగ్గిన నేపథ్యంలో గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన నష్టాలను పరిశీలించేందుకు తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సర్పంచి గురువారం ఉదయం గ్రామంలో పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వానల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులతో మాట్లాడారు. రవాణాకు సిద్ధం చేసి కళ్లాలలో నిలువ ఉంచిన ధాన్యం తడిసిన నేపథ్యంలో రైతులు వాటిని ఆరబెట్టేందుకు రోడ్లపై తెచ్చారు. మాజీ ఎంపిటిసి కోట శంకరం, కోట బంగారియ్య, ఇతరులు రైతులు పడుతున్న ఇబ్బందులను సర్పంచి దృష్టికి తెచ్చారు. సడలించిన నిబంధన మేరకు తేమశాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించిందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో తేమశాతం తగ్గించేందుకు రోడ్లపై ఆరబెడుతున్నామని తెలిపారు. గ్రామ పరిధిలో ఇంతవరకు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పత్తి జరిగిన మూడువేల టన్నుల ధాన్యం తరలింపు సమస్యను సర్పంచికి తెలియజేశారు. ఇదే క్రమంలో కళ్లాలలో నిలువ ఉంచిన ధాన్యపు రాసుల కింద భాగం లోనికి చెమ్మ చేరిన నేపథ్యంలో ధాన్యం మొలక వచ్చిందని సర్పంచికి తెలిపారు. దీనిపై స్పందించిన సర్పంచి సదరు ధాన్యం తరలింపు విషయమై సమస్యను ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇదేవిధంగా తుపాను కారణంగా బిసి కాలనీలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో 10, 11, 12వ వార్డులలో తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉపసర్పంచి కోట శ్రీనివాసరావుతో పాటు వైసిపి ప్రముఖులు బి.పెద్దిరాజు, ఎస్‌.రాజు, ఎం.రాజేష్‌, అప్పారావు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇదేవిధంగా తుపాను కారణంగా చెట్లు విద్యుత్‌ లైన్లపై ఒరగటం, కొన్నిచోట్ల తెగిన పెద్ద కొమ్మలు లైన్లపై పడడం వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా లైన్ల మరమ్మతులకు వాటిని తొలగించామని తెలిపారు. ఇదేవిధంగా తుపాన్‌ కారణంగా పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌స్థానంలో ఎంఎల్‌ఎ ఆదేశాలతో, ట్రాన్స్‌ కో అధికారుల సహకారంతో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశామన్నారు. దీంతో విద్యుత్‌ సరఫరా సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. జగనన్న కాలనీకి అనుసంధానంగా ఉన్న రోడ్డు ముంపుకు గురై, రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో వరద నీటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సర్పంచి తెలియజేశారు.

➡️