రద్దీ చూసి.. ధర దిగ్గోసి..

Feb 27,2024 23:39

మిర్చి యార్డులో టిక్కీలు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు మిర్చి యార్డులో 10 రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మంగళవారం 1,56,917 టిక్కీలు యార్డుకు వచ్చాయి. పాత నిల్వలతో కలిపి 1,40,541 టిక్కీలు అమ్ముడుపోయాయి. ఇంకా 1,19,436 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గత వారం రోజుల్లో క్వింటాళ్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ధరలు తగ్గుతున్నాయి. సరుకు భారీగా రావడం వల్ల ధరలను వ్యాపారులు తగ్గిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పల్నాడు జిల్లాలో ఇప్పటికే రైతుల కళ్లాల్లోనే కొనుగోలు ప్రారంభించారు. యార్డులో ఎక్కువ మంది రైతుల వద్ద తేమ శాతం అధికంగా ఉందని కూడా ధర కొంత తగ్గిస్తున్నారు. గతేడాది ఇదే రోజుల్లో మిర్చి ధరలు గరిష్టంగా రూ.25 వేల నుంచి రూ.27 వేలవరకు పలికాయి. మంగళవారం మార్కెట్‌లో ధరలు వివరాలు ఇలా ఉన్నాయి. మేలురకం తేజ, బాడిగ రకాలు కనిష్టంగా క్వింటాళ్‌ రూ.9 వేలు ఉండగా గరిష్టంగా రూ.21 వేలు పలికాయి. సాధారణ రకాల ధరలు కనిష్టంగా రూ.9 వేలు పలకగా గరిష్టంగా రూ.20,400 మాత్రమే పలికాయి. 334 కనిష్ట ధర రూ.10 వేలు గరిష్ట ధర క్వింటాలు రూ.20,400, నెంబరు 5 రకం 10,500, రూ.19 వేలు, 273 రూ.12,500, 19,500, 341 వెరయిటీ రూ.9 వేలు, రూ.20 వేలు, సూపర్‌ 10 రూ. 13వేలు, రూ.16,700 ధర వచ్చింది. గత నెల రోజుల కాలంలో సరుకు ఎక్కువ వచ్చిన రోజున ధరలు భారీగా తగ్గిస్తున్నారు. సరుకు తక్కువగా వచ్చిన రోజు సగటు ధర స్వల్పంగా పెంచడం వ్యాపారులకు పరిపాటిగా మారింది. ఏ వెరైటీ కూడా గరిష్టంగా రూ. 21 వేలు దాటడం లేదు. సరుకు ఒకేసారి ఎక్కువగా రావడం వల్ల ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇళ్లల్లో నిల్వ చేసుకోలేమని, కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకున్నా ప్రస్తుతం అప్పులు చెల్లించేందుకు నగదు అవసరమని, అందుకే అయిన కాడికి అమ్ముకుంటున్నామని చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు కనిష్టంగా 10 నుంచి15 క్వింటాళ్లు కూడా రాలేదు. నీటి సరఫరా బాగున్న ప్రాంతాలు, బోర్లు ద్వారా సాగుచేస్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు వచ్చింది. కానీ కాల్వచివరి భూముల్లోని రైతులకు సకాలంలో నీరు అందక ఇబ్బంది పడ్డారు. జనవరిలో ఒక తడికి నీరు అవసరం ఉన్నా కాల్వలకు నీరు విడుదల చేయకపోవడం వల్ల నీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో దిగుబడి తగ్గింది. గతంలో ధర కొంత తగ్గినా దిగుబడి బాగుంటే రైతులకు కొంత ఉపశమనం ఉండేది. ఈ ఏడాది ధరలు పూర్తిగా ఆశాజనకంగా లేకపోవడం, దిగుబడి లేక రైతులు నిరాశకు గురవుతున్నారు.

➡️