రద్దీ ప్రాంతాల్లో జనంలో దూరి.. చోరీ..

Mar 13,2024 22:00

నిందితుల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల మెడల్లోని ఆభరణాలు, బ్యాగుల్లోని డబ్బును అపహరించే కేసుల్లో ఇద్దరు మహిళల్ని నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను సిఐ సిహెచ్‌ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈనెల 6న చిలకలూరిపేటకు చెందిన ఇట్లాపురం షహనాజ్‌ అనే యువతి వినుకొండలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో తన బ్యాగ్‌లోని రూ.10.60 లక్షల విలువచేసే 213 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించి అదేరోజు స్థానిక వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం జగనన్నకు చెబుదాంలో కూడా ఫిర్యాదు చేశారు. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించి చోరీకి పాల్పడింది మహిళలని నిర్థారించుకున్నారు. గుంటూరు, బాపట్ల, ఒంగోలు, ప్రాంతాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న బాపట్ల జిల్లా ఈపూరుపాలెం మండలం, తోటవారిపాలెం, గుంటూరు రూరల్‌ ఏటుకూరుకు చెందిన కుంజా లక్ష్మీ, యశోదలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం చిలకలూరిపేట రోడ్డులో సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో పలు కేసుల్లో వీరే నిందితులుగా నిర్థారించి అరెస్టు చేశారు. వారి నుండి తాజా చోరీలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

➡️