రిజిస్ట్రేషన్‌ లేకుంటే కఠిన చర్యలు : డిఐఒ

ఉషశ్రీ ప్రజాశక్తి-మదనపల్లి ప్రయివేట్‌ ఆస్పత్రుల వైద్యులు, స్కాన్‌ కేంద్రాల వైద్యులు, ల్యాబ్స్‌, డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల సిబ్బంది రోజువారీ, నెలవారీ నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వాలని అన్నమయ్య జిల్లా పిసిపిఎన్‌డిటి నోడల్‌ అధికారి, డిఐఒ డాక్టర్‌ ఉషశ్రీ అన్నారు. మంగళవారం జిల్లా ఆస్పత్రిలోని డిఇఐసి హాల్‌లో డివిజన్‌ పరిధిలోని ప్రయివేటు ఆస్పత్రులు, స్కాన్‌ సెంటర్స్‌ వైద్యులు ల్యాబ్స్‌, డయాగ్నోస్టిక్స్‌ సిబ్బందికి వారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నివేధికలపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ ఎపిఎపిఎంసిఇ 2002 చట్టం, పిసిపిఎన్‌డిటి చట్టం 1994 ప్రకారం ప్రయివేటు ఆస్పత్రులు, స్కాన్‌ సెంటర్స్‌, ల్యాబ్స్‌, డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని నడుపుకోవాలని లేనిచో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రిలో ఉండా ల్సిన కనీస సౌకర్యాలు తాగునీరు, రోగులు వేచియుండు హాల్‌, మరుగుదొడ్లు, వార్డులు, ఫైర్‌ సేఫ్టీ, లిఫ్ట్‌, ర్యాంప్‌, పార్కింగ్‌ ప్రదేశం వంటివి తప్పక నిర్వహించాలని ఆదేశిం చారు. రోగు లకు అందించు చికిత్సలకు బిల్లులు ఇవ్వాలి, వారు అందించు చికిత్సలకు చేయు ఛార్జిలు అనగా ధరల పట్టికను రెసిప్షన్‌లో ప్రజలకు కనపడే విదంగా ఉంచాలన్నారు. డిప్యూటీ డెమో దేవశిరోమని మాట్లాడుతూ స్కాన్‌ సెంటర్స్‌ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం యొక్క పోస్టర్స్‌, బ్యానర్లు కనపడేలా అంటించాలి, ఆరోగ్యశ్రీ అనుమతి పొందిన ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో లభించే సేవలపై ఉన్న పోస్టర్లు ప్రజలకు కనపడేలా ఉంచాలని పేర్కొన్నారు. ఆరోగ్య మిత్రలు షిఫ్ట్‌ పద్దతిలో అందుబాటులో ఉండాలని ప్రస్తుతం బాల, బాలికల నిస్పత్త్రి 934 ఉందన్నారు. మందులకు ఫార్మసీలో కూడా బిల్‌ ఇవ్వాలని, స్కాన్‌ చేయించుకున్న వారికి కూడా బిల్‌ ఇవ్వాలని ఆదేశించారు.మదనపల్లె డివిజన్‌ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ప్రయివేటు ఆస్పత్రి, ల్యాబ్‌, స్కాన్‌ సెంటర్‌ తప్పక రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. డిఎస్‌ఒ కరీముల్లా మాట్లాడుతూ రోజు వారీ ఆస్పత్రిలో ఒపి వివరాలు, ఐపి వివరాలు, కాన్పులు, అబార్షన్స్‌, సిజేరియన్‌ ప్రసవాలు, మాతా శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ల్యాబ్‌టెస్ట్‌లు, జనన, మరణాలు ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. జిల్లా అంటువ్యాధుల పర్యవేక్షకులు వెంకటేష్‌ మాట్లాడుతూ నమోదవుతున్న అంటువ్యాధులు అనగా వైరల్‌ జ్వరాలు, టిబి, కామెర్లు, అతిసార వంటి వాటి వివరాలు ఐహెచ్‌ఐపి పోర్టల్‌, ఆప్‌లో అప్లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. అసంక్రమిత వ్యాధుల వివరాలు అనగా షుగర్‌, బిపి, పక్షవాతం, థైరాయిడ్‌, గుండెజబ్బు వంటి వ్యాధుల వివరాలు రోజువారీ యాప్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. స్కాన్‌ నిర్వహించిన గర్భవతుల వివరాలు పిసిపిఎన్‌డిటి పోర్టల్‌లో అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. పై వివరాలు అన్నిటికి ఫిసికల్‌ కేస్‌ షీట్లు ఫైల్‌ చేయాలని ఆన్‌లైన్‌లో పొందుపరచే రిపోర్ట్లు అన్నియు హార్డ్‌ కాపీలు నిల్వ ఉంచాలని తెలిపారు. ఇప్పటికే పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిల ద్వారా వారి పరిధిలోని ఆస్పత్రుల, ల్యాబ్స్‌, స్కాన్‌ సెంటర్స్‌ వివరాలు సేకరించామని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారికి ఇప్పటికే తాకీదులు ఇచ్చామని వారు నిర్ధేశించిన గడువులోపు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఒపిలో నమోదయ్యే జ్వరాల వివరాలు రోజువారీ ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. నెలనెలా ప్రయివేటు ఆస్పత్రుల రెపోర్టులు పర్యవేక్షణకు గాను డివిజన్‌ స్థాయిలో కమిటీలు వేస్తున్నామని వారు చెక్‌ లిస్ట్‌ ప్రకారం తనిఖీ చేసి రిపోర్టు ఉన్నతాధికారులకు అందచేస్తారని తెలిపారు. సమావేశంలో ఎన్‌జిఒ నిర్వాహకులు లలిత, మదనపల్లె డివిజన్‌ పరిధిలోని ప్రయివేటు ఆస్పత్రుల వైద్యులు, స్కాన్‌ సెంటర్‌, ల్యాబ్‌, డయాగ్నోస్టిక్స్‌ నిర్వాహకులు హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ మహమ్మద్‌ రఫీ, రాజగోపాల్‌, ఉష, సిబ్బంది అమర, గోపాల్‌ పాల్గొన్నారు.

➡️