రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే జగన్‌ సంక్షేమం : పుల్లారావు

Feb 19,2024 18:03

విలేకర్లతో మాట్లాడుతున్న పత్తిపాటి పుల్లారావు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో వైసిపి విధ్వంస పాలన మొదలైందని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడం జగన్‌ సంక్షేమమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్థానిక పండరిపురంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సిద్ధం సభల పేరుతో ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వైసిపి సిద్ధమైందని, ఈ ఐదేళ్లలో పాలనపై చర్చకు సిఎం సహా వైసిపి నాయకులు సిద్ధమా? అని సవాలు విసిరారు. ఇసుక, మైనింగ్‌, మద్యం, కాంట్రాలతో రూ.వేల కోట్లు దోచేశారని, హత్యలు, అరెస్టులు, కూల్చివేతల రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనిక సిఎంగా ఉన్న జగన్‌కు పేదల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అన్ని వర్గాల్ని మోసం చేసిన సైకోకు సామాజిక న్యాయం ఊసెత్తే నైతికత ఉందా? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల్ని గాలికొదిలేసి రాయలసీమను ఎండబెట్టిన ద్రోహి జగన్‌ అని విమర్శించారు. జగన్‌ పేరు చెబితే రాష్ట్రంలో గుర్తొచ్చేది అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, మోసాలు, దొంగ ఓట్లు, ఫ్యాక్షన్‌ వేధింపులు, రక్త చరిత్రలేనన్నారు. జర్నలిస్టులపై ఎందుకు దాడులకు పాల్పడుతున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు విరవడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు.

➡️