రూ.13.8 కోట్లతో హైలెవ్‌ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

ప్రజాశక్తి-వీరబల్లి మండలంలోని గడికోట పంచాయతీలోని పెద్దూరు వద్ద మాండవ్య నదిపై రూ.13.8 కోట్లతో హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ మాజీ జస్టిస్‌ సివి నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు నదిపై బ్రిడ్జి లేక వర్షాలు వస్తే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉండేవారన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో గడిగోట ప్రజల కల నెరవేరునట్లు అయింది. నాగార్జునరెడ్డి తన సొంత గ్రామం కావడంతో ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయ కులతో చర్చించి పట్టుదలతో ఈ హై లెవెల్‌ బ్రిడ్జిని తీసుకవచ్చారని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకున్న పాపాన పోలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. బ్రిడ్జి మంజూరుకు ప్రయత్నించిన స్థానిక నాయకులకు ముఖ్యమంత్రికి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్ల కల నేటితో మాకు నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి విజయభాస్కర్‌ రెడ్డి, ఎంపిపి గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి, గాలివీటి వీరనాగిరెడ్డి, రాజంపేట నియోజకవర్గపు వైసిపి నాయకులు గాలివీటి మదన్‌రెడ్డి, జడ్‌పిటిసి శివరాంగౌడ్‌, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండలం లోని వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️