రెవెన్యూ ఉద్యోగి భూ ఆక్రమణ

ప్రజాశక్తి-వాల్మీకిపురం ఓ రెవెన్యూ ఉద్యోగి 2.72 సెంట్లు భూమిని ఆక్రమించుకొని యథేశ్ఛగా వ్యవసాయం చేసుకుంటున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని ఓ విఆర్‌ఎ తాటిగుంటపల్లిలోని భూమిని అక్రమంగా ఆక్రమిం చుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఓ విఆర్‌ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఆక్రమణకు గురైన భూమిలో వరి మడి నాటి వ్యవసాయం చేసుకుంటుండడం, స్థానికంగా రాజకీయంగా పలుకుబడి ఉండడంతో నన్నేమి చేయలేరు అనే ధీమాతో ఆక్రమణలకు పాల్పడుతున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విఆర్‌ఒ గానీ, తహశీల్దార్‌ గానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా, స్పందనలో ఫిర్యాదు చేసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చర్చనీయంశంగా మారింది. రెవెన్యూ ఉద్యోగి భూ ఆక్రమణకు పాల్పడితే ఎవ్వరూ పట్టించుకోరు.. అదే సామాన్య ప్రజలు ఇలా చేస్తే అధికారులు చూస్తూ ఉంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విఆర్‌ఎ భూమి ఆక్రమించుకోవడమే కాకుండా డీ ఫారం పట్టా లేకుండా 1బి, అడంగల్‌, ఏ రిజిస్టర్‌ కాపీలో కూడా తన పేరును నమోదు చేసుకోవడంతో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న విఆర్‌ఏపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️