రేషన్‌ సరుకులను అమ్మితే కార్డు రద్దు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో ప్రతినెలా రేషన్‌ సరఫరా సక్రమంగా లబ్ధిదారులకు చేరవేసేలా జిల్లా పౌర సరఫరాల శాఖ పనిచేస్తోందని రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ సరుకులు సకాలంలో సరఫరా చేస్తూ వారి హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఎస్‌.పద్మశ్రీ అన్నారు. వినియోగదారులు రేషన్‌ సరుకులను వినియోగించుకోకుండా అమ్ముతున్నట్లు తెలిస్తే వారికి రేషన్‌ సరుకులు అవసరం లేదని భావించి రేషన్‌ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రజాశక్తికి ఇంచిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు.
జిల్లాలో ఎంత మంది రేషన్‌ కార్డు దారులున్నారు?
ఇంటింటికీ రేషన్‌ అందుతోందా?పల్నాడు జిల్లాలో 6,44,322 మంది రేషన్‌ కార్డు దారులున్నారు. 1290 రేషన్‌ దుకాణాలు, వీటికి అనుసంధానంగా 402 ఎమ్‌డియు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటింటికి రేషన్‌ సక్రమంగా అందడం లేదనే విమర్శలు వస్తున్నా అందులో వాస్తవం లేదు. ఇలాంటి విమర్శలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘డిస్ట్రిబ్యూషన్‌ లొకేషన్స్‌ స్టేటస్‌’ యాప్‌ను రూపొందించింది. వాలంటీర్లు కొత్త యాప్‌ ఆన్‌స్టాల్‌ చేసుకున్నారు. దీనిద్వారా వారి పరిధిలోని లబ్ధిదారుల ఇంటికి ఎమ్‌డియు వాహనం ఏ సమయానికి వస్తుందో కూడా పూర్తిగా సమాచారం అందజేస్తారు.
ఏమేమి సరుకులు సరఫరా చేస్తున్నారు?
ఈ నెలలో 87.23 శాతం లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు సరఫరా చేశాం. బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి సరఫరా చేస్తున్నాం. గతంలో కందిపప్పు కొరత కారణంగా ఇవ్వలేకపోయాం. 4 నెలలు నుండి ఆ సమస్య లేదు.
సరుకులు కాకుండా డబ్బులిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కదా?
లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు సక్రమంగా ఇవ్వాలని ఆదేశిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులే స్వయంగా డబ్బులు అడుగుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది ఎమ్‌డియు వాహనదారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఎమ్‌డియు వాహన దారులపై చర్యలు తీసుకున్నాం. రేషన్‌ సరఫరాలో ఏమైనా ఇబ్బందులున్నా, ఎమ్‌డియు వాహనదారుల ఏమైనా ఇబ్బందులు పెట్టినా టోల్‌ ఫ్రీ నం.1967కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఎమ్‌డియు వాహనదారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తాం.
రేషన్‌ అక్రమ రవాణా, ఎన్ని కేసులు నమోదు చేశారు?
రేషన్‌ అక్రమ నిల్వలకు రవాణాకు సంబంధించి ఈ ఏడాది 99 (6ఏ) కేసులు నమోదు చేసి 3439.87 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేశారు.ధాన్యం సేకరణ కోసం ఏంత కొన్నారు?ధాన్యం సేకరణ కోసం ఖరీఫ్‌ లో 2275.6 టన్నుల దాన్యం 361 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేశాం. ఇందుకుగాను రైతులకు రూ.4.66 కోట్లు చెల్లించాం. రబీలో 38 మంది రైతుల వద్ద నుండి 242.6 టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ.50 లక్షలు చెల్లించాం.
రేషన్‌ సరుకులు నాణ్యత లేకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
రేషన్‌ సరుకుల్లో పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్‌ బియ్యం, గోధుమ పిండి సరఫరా చేస్తున్నాం. నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు తప్పకుండా పరిశీలిస్తున్నాం. బియ్యం వయస్సు కనుగొనే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. లబ్ధిదారులు భద్రపరచుకునే విధానంలో లోపం ఉంటే సరుకుల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. అయినా నాణ్యత విషయంలో ఏమైనా తేడాలు ఉంటే పైన తెలిపిన టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫోర్టిఫైడ్‌ బియ్యం, గోధుమ పిండిలో దాగి ఉన్న పోషక విలువలు గురించి అంగన్వాడీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ సరుకుల పట్ల ప్రజలలో ఉన్న అపోహలు వీడాల్సిన అవసరం ఉంది.ఫోర్టిఫైడ్‌ బియ్యం, గోధుమ పిండి వల్ల ప్రయోజనాలు?ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని చిన్నారులు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తహీనత ఇనుము లోపం అనీమియా మెరుగుపరుస్తుంది. గోధుమపిండిలో ఐరన్‌ తయామిన్‌ రిబోఫ్లావీన్‌ పోలిక్‌ యాసిడ్‌ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనికి సంబంధించి పౌరసరఫరా శాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన గోడ పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవినీతి, అక్రమాలు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సివిల్‌ సప్లయీస్‌ మండల నియోజకవర్గాల్లో అధికారులు, సిబ్బంది, ఎమ్‌డియు సిబ్బంది, రేషన్‌ డీలర్లు అందరూ సహకరించి వినియోగదారులకు సక్రమంగా చేరేలా పని చేయాలి.

➡️