రైతుల ఆందోళనలపై కేంద్రం తీరు దారుణం

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం తీరు దారుణమని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బిజెపి ప్రభుత్వం దాడి చేయిం చడం సరికాదని మర్శించారు. మద్దతు ధర చట్టం చేయమని, రెండేళ్ల క్రితం రైతులకు క్షమాపణలు చెబుతూ మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోరాటం సందర్బంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రెండవ దఫా రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమంపై హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం వల్ల 23 ఏళ్ల యువరైతు మృతి చెందిన ఘటనపై శుక్రవారం ఎపి రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో రైతుల భూములను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తూ మోడీ తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రైతాంగం 15 నెలలు చేసిన పోరాటాలు చేశారన్నారు. అప్పట్లో మోడీ ప్రభుత్వం దేశ రైతాంగానికి క్షమాపణలు చెబుతూ ఇచ్చిన హామీలు మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని చెప్పారు. కాబట్టే రైతాంగం రెండవదఫా పోరాటాలకు దిగాల్సిన పరిస్థితులకు మోడీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. పది ఏళ్ల కాలంలో మోడీ విధానాల ఫలితంగా 1.60 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా బిజెపి ప్రభుత్వం ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతాంగంపైకి పోలీసులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం నిషేధించిన పెళ్లెట్స్‌ వంటి ఆయుధాలను, భాష్పవాయు గోళాలను రైతులపై విసరబట్టే 200 మంది రైతులు గాయపడి, అనేక మంది చూపు కోల్పోయారని, ముగ్గురు రైతులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని, శుభ్‌ కరణ్‌ సింగ్‌ అనే 23 ఏళ్ల యువరైతు ప్రాణాలు వదిలాడని, ఇవి సాధారణ మరణాలు కావని, మోడీ ప్రభుత్వ హత్యలని విమర్శించారు. బిజెపి ప్రభుతం రైతాంగ సమస్యలు విస్మరిస్తే భావితరాలు ఆహార సంక్షోభం ఎదుర్కో తప్పదని తెలిపారు. పోలవరంతో పాటు పెండింగ్‌లోని నీటి ప్రాజెక్టుల పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు చెన్నయ్య, మూధవయ్య, పామయ్య, డి.భాగ్య లక్ష్మి, సిద్దమ్మ, సుమలత, భూదేవి, సునందమ్మ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌: గిట్టుబాటు ధర, న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న పోరాటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానవీయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట నియోజకవర్గ బాధ్యులు పూల భాస్కర్‌ తెలిపారు. పట్టనంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కార్మిక నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో పంజాబ్‌ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 21 ఏళ్ల యువరైతు శుభకరన్‌ సింగ్‌ మృతి చెందడం తీవ్ర బాధాకరమని తెలిపారు. మరో రైతు గుండెపోటుతో మృతి చెందడం విచారకరమన్నారు. లక్షలాదిమంది రైతులు పోరుబాటలో ఉన్నా మద్దతు ధర చెల్లిస్తామని, కేసులు ఎత్తివేస్తామని హామీలు గుప్పించిన బిజెపి ప్రభుత్వం హామీల అమలును ఉల్లంఘించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం బిజెపి నిరంకుశత్వానికి తార్కాణమని తెలిపారు. రైతుల న్యాయమైన హామీలు నెరవేర్చే వరకు వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు ప్రసాద్‌, సురేష్‌, లక్ష్మణ్‌, హరి, సుంకన్న, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️