రైతు కంట కన్నీరు..ఆదుకోవాలని వేడుకోలు

Dec 8,2023 20:48

ప్రజాశక్తి – సీతానగరం  :  ఇటీవల సంభవించిన మిచౌంగ్‌ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వరిచేలు నీట మునగాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరు మున్నీరై రోధిస్తున్నారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు కారణంగా పొలాల్లో ఉన్న పంటతో పాటు ముందుగా కోసిన వరి కుప్పలు కూడా తడిచిముద్దయ్యాయి. మండలంలోని బూర్జ, లచ్చయ్యపేట, అంటిపేట, రెడ్డి వాని వలస, చినబోగిలి, కాసాపేట గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోత కోయకుండా ఉన్న భూముల్లో వరిసెలు నెలకొరిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.20వేలు వరకు పెట్టుబడులు పెట్టి చేతికొచ్చిన సమయంలో తుపాను రూపంలో వచ్చి ముంచేసిందని రైతులు దిగులు చెందుతున్నారు. పంట నష్టాలను అధికారులు అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు తహశీల్దార్‌ ఎంవి రమణ, ఎఒ ఎస్‌.అవినాష్‌ ఆధ్వర్యంలో తుపాను అంచనాలు వేయడానికి ముంపు గ్రామాలను పర్యటించారు. అందులో 15 హెక్టార్లలో 61 మంది రైతులకు నష్టం వాటిల్లుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. అయితే ఎక్కువ ముంపునకు గురైనందున పంట పొలాల నుంచి నీటిని తొలగించి, ఉప్పు ద్రావణాన్ని వరిశేలపై పిచికారి చేస్తే ధాన్యానికి ఎటువంటి నష్టం జరగదని ఆయన సూచించారు. నష్టం అంచనాలను జిల్లా అధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు.నాయకులు పరిశీలనమండలంలోని పంట నష్టపోయిన గ్రామాల్లో ఇప్పటికే సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మినాయుడు, సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, నాయకులు అప్పారావు అంటిపేట, రెడ్డివానివలస గ్రామాలు పర్యటించారు. పంట ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. అలాగే టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరుచంద్ర, మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.తిరుపతిరావు, ఆర్‌.వేణుగోపాలనాయుడు, తదితరులు కామన్నదొరవలసలో ముంపునకు గురైన గ్రామాల్లో పర్యటించారు. నష్టం అంచనా వేసి తక్షణమే రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి

నేను ఎకరాన్నర విస్తీర్ణం వరిసాగు చేశాను. తుపానుకు ముందు కోత కోశాను. అయితే తుపాను కారణంగా కురిసిన వర్షాలకు కోసిన పంట నీటిలో మునిగింది. సుమారు రూ.40 వేల వరకు ముదుపు అయ్యింది. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి. కావున ప్రభుత్వమే ఆదుకోవాలి.

చందనపల్లి కృష్ణారావు, రైతు, చిన బోగిలి.

రైతులను ఆదుకోవాలి

తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. చేతికి వచ్చిన పంట తుపాను కారణంగా నీటిపాలైంది. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన కూడా చేశారు. వీటిపై నివేదికలు ఇచ్చి ప్రభుత్వం అందించాలని కోరుతున్నాం.

బి.అప్పారావు, చిన్నబోగిలి.

నష్టం అంచనా వేశాం…

ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించాం. నష్టం అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. మండలంలోని 61మంది రైతులకు చెందిన సుమారు 35 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశాం. అలాగే ముందుస్తు నూర్చిన ధాన్యం 28వేల బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించాం. తరలించిన ధాన్యానికి 48 గంటల్లో వారి ఖాతాలోనే డబ్బులు జమవుతున్నాయి.ఎస్‌.అవినాష్‌,మండల వ్యవసాయాధికారి.

తుపాన్‌ వెళ్లింది… నష్టం మిగిలింది

పార్వతీపురం రూరల్‌ : మిచౌంగ్‌ తుపానుకు నాలుగు రోజుల పాటు రైతులు చిగురుటాకులలో వణికిపోయారు. పండించిన పంట కల్లాలకు చేర్చుకోలేక కొందరు చేర్చుకున్న పంటను కుప్పలుగా వేసుకొని, మరికొందరి చేను పూర్తిగా తడిసిపోయి తీవ్ర నష్టాలకు గురయ్యారు. మండలంలోని 18 వేల ఎకరాల్లో వరి సాగవ్వగా, సుమారు 13వేల ఎకరాల వరకు చేను పూర్తిగా తడిసిపోయింది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో పాటు, పంటను రక్షించుకునేందుకు టార్పిన్లు సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కళ్లముందే పంటను వానకు అప్పగించి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయే పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు. నిన్నటి నుండి వాతావరణం కాస్త తెరిపు ఇవ్వడంతో తడిచిపోయిన తమ ధాన్యాన్ని రైతులు ఎండబెట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. పొలాల్లోనే పనల రూపంలో ఉన్న పంట తడిచి మొలకలు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టాలను అంచనాలు వేసి నష్టపరిహారం ఇప్పించాలని, అంతేకాకుండా రంగు మారిన ధాన్యాన్ని మిల్లర్లు బేషరతుగా కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

➡️