రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌ రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్‌ ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా 5వ ఏడాది 3వ విడత ఆర్ధిక సాయంతో పాటు, రబీ 2021-22, ఖరీఫ్‌ 2022కు సంబంధించి వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కిరైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్‌ విసి హాలు నుంచి కలెక్టర్‌ వి.విజరు రామరాజు, జెసి గణేష్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఓబుల కొండారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు హాజరయ్యారు. విసి అనంతరం కలెక్టర్‌ విజరు రామరాజు అతిధులతో కలిసి జిల్లాలో పిఎం కిసాన్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా వరుసగా 5వ ఏడాది 3వ విడతగా జిల్లాలో 2,10,625 మంది రైతులకు గాను రూ.42,29,21,000 లతో పాటు 41,828 మంది రైతులకు రూ.10,54,76,311 మేరా వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో రైతులకు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేశారని పేర్కొన్నారు. మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందించిందన్నారు. ప్రకతి వైపరీత్యాలకారణంగా దెబ్బతిన్న పంటలకు సంబందించిన నష్ట పరిహారాన్ని ఆ సీజన్‌ ముగిసేలోపే అందించారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధగా చెప్పవచ్చన్నారు. అర్హత ఉండి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్బికెల్లో నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా కాల్‌ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉద్యానశాఖ డిడి రాజీవ్‌ మైఖేల్‌, వ్యవసాయశాఖ ఎడిలు అనుబంధ శాఖల అధికారులు, లబ్దిదారులయిన రైతులు పాల్గొన్నారు.

➡️