రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు శంకుస్థాపన

Feb 26,2024 21:36

 ప్రజాశక్తి-విజయనగరంకోట, బొబ్బిలి చీపురుపల్లి, కొత్తవలస :  జిల్లాలో మూడు రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి చేస్తూ అమృత భారత్‌ స్టేషన్లుగా రూపొందించేందుకు, నగరంలోని బి.సి.కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై నిర్మించనున్న పైవంతెన నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేశారు. నగరంలోని బిసికాలనీ ప్రాంతంలోని మ్యాంగో యార్డు నుంచి రైల్వే ట్రాక్‌ దాటేందుకు వీలుగా రూ.48.98 కోట్లతో రైల్వేశాఖ నిర్మించనున్న వంతెన పనులకు, కొత్తవలసలో రూ.18.77 కోట్లు, చీపురుపల్లిలో రూ.21 కోట్లతో, బొబ్బిలిలో రూ.16 కోట్లతో అమృతభారత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన జరిగింది. నగరంలోని మ్యాంగో యార్డు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు చందక శ్రీను, బి.పద్మావతి, వాల్తేరులోని డిప్యూటీ చీఫ్‌ సిగలింగ్‌ టెలికం ఇంజినీర్‌ సిహెచ్‌.వి.కారుణ్య, బిజెపి జాతీయ కౌన్సిల్‌ సభ్యులు శివప్రసాదరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పైవంతెన పనులకు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. కార్యక్రమంలో విటి అగ్రహారం జెడ్‌పి హైస్కూల్‌ ప్రదానోపాధ్యాయులు ఎస్‌.ఎస్‌.వి.టి.రాజేశ్వరరావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వం, పెయింటింగ్‌, క్విజ్‌ పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ బొబ్బిలిలో రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ పాండే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్‌పి బెల్లాన మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలో మూడు స్టేషన్లు ఆధునీకరణ జరుగుతుందన్నారు. అండర్‌ బ్రిడ్జిలో నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రైలు టైమింగ్స్‌ మార్చాలని రైల్వే అధికారులను కోరారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావ, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, బిజెపి నియోజకవర్గ కన్వీనర్‌ మరిశర్ల రామారావునాయుడు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. కొత్తవలస రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రైల్వేశాఖ అధికారులు సి.ఆర్‌.దాస్‌, శివ నరేష్‌, పార్వతీశం, వాల్తేరు సిఎంఎస్‌ జ్యోతి, జే.వి.రావు, సాయిఅనువబ్‌ నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, కొత్తవలస రైల్వే సిబ్బంది, పాల్గొన్నారు.

సిపిఎం నాయకుల వినతి

కొత్తవలస రైల్వే గేట్‌ వద్ద ఫుట్‌ పాత్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ రైల్వే అధికారులకు వినతి అందజేశారు. ప్రతిరోజు పాదాచారులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొత్తవలస రైల్వే స్టేషన్లో కోర్బా, ఇంటర్‌సిటీ, రాయగడ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదల చేయాలని కోరారు. దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన వర్చువల్‌ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘువర్మ, బిజెపి అధ్యక్షులు ఎన్‌.ఈశ్వరరావు, బెల్లాన వంశీకృష్ణ, ఇప్పిలి నీలకంఠం పాల్గొన్నారు.

➡️