రోడ్డుపై కూరుకుపోయిన లారీ

ప్రజాశక్తి- బొబ్బిలి: బొబ్బిలి-తెర్లాం రోడ్డు అద్వాన్నంగా మారింది. గొల్లపల్లి సమీపంలో పిరిడి జంక్షన్‌ వద్ద రోడ్డుపై ఏర్పడిన గోతిలో గురువారం లారీ కూరుకుపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పారాది వంతెన కుంగడంతో భారీ వాహనాలను రామభద్రపురం నుంచి బాడంగి, తెర్లాం మండలాలు మీదుగా మళ్లించారు. భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో పినపెంకి నుంచి బొబ్బిలి వరకు రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోతులలో వరదనీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిరిడి జంక్షన్‌ సమీపంలో గోతిలో లారీ కూరుకుపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు బాగు చేయాలని, పారాది నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

➡️