రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ – కాలనీవాసుల నిరసన

Jan 31,2024 11:57 #Drainage, #issues, #Protest, #road

విశాఖ : పూర్ణ మార్కెట్‌ దగ్గర ఉన్న ఆయిల్‌ మిల్లు సందులో డ్రైనేజీ అంతా రోడ్డుపై పారుతుందని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడమే కాకుండా వ్యాధులు కూడా ప్రబలుతున్నాయంటూ … సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ … ద్రోణంరాజు కాలనీలో పెద్దపెద్ద హోల్‌ సేల్‌ వ్యాపారం జరుగుతుందన్నారు. ఇక్కడ రోడ్లు గాని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ గాని అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి మానవ విసర్జాలు కూడా బయటికి వస్తున్నాయని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి రోడ్లపైన విసర్జాలు ఉంటున్నాయని, మరోవైపు వాహనాల తాకిడితో అది పూర్తిగా రోడ్డంతా అద్వాన్నంగా తయారయ్యిందన్నారు. దీంతో విపరీతమైన వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ స్వయంగా పరిశీలించారని తెలిపారు. ఆరు మాసాలు అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. సిఐటియు నాయకత్వంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కి వివరిస్తే హేళనగా మాట్లాడటం నిర్లక్ష్య సమాధానమివ్వడం చేశారని, ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పరిష్కారం జరగలేదన్నారు. స్థానిక మహిళా నాయకులు బి.లక్ష్మి, కే.లక్ష్మి, తదితర నాయకులు, స్థానిక ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.చంద్రశేఖర మాట్లాడుతూ … ఈ అపరిశుద్ధ వాతావరణం వల్లనే విపరీతంగా వ్యాధులు ప్రబలుతున్నాయని వ్యాధుల కోసమే సంపాదించిన ఆదాయం అంతా ఖర్చయిపోతుందని చెప్పారు. పిల్లలు కూడా అనారోగ్యం పాలవుతున్నారని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఠా మేస్త్రి వెంకటరమణ, శ్రీను మాట్లాడుతూ … ప్రభుత్వం ప్రజల నుంచి ఇంటి పన్ను, చెత్త పన్ను తీసుకోవడమే తోనే సరిపోతుంది కానీ ప్రజలకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని అన్నారు. వీరితోపాటు మెడికల్‌ రిపెండెంట్‌ నాయకులు కళాధరు, సిఐటియు జగదాంబ జోన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి పాల్గొన్నారు.

➡️