రోడ్డు నిర్మాణానికి విస్తృతంగా సంతకాల సేకరణ

ప్రజల నుండి సంతకాలు సేకరణ చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -అచ్యుతాపురం

అచ్యుతాపురం -అనకాపల్లి రహదారి నిర్మించాలని సిపిఎం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. నాలుగో రోజు శనివారం హరిపాలెం గ్రామంలో సిపిఎం నాయకులు కె.రామసదాశివరావు, ఆర్‌.రాము ఆధ్వర్యాన సంతకాల సేకరణ చేపట్టారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ముఖ్యమంత్రికి దండం పెడుతూ వెంటనే రోడ్డు నిర్మించాలని కోరారు. ఈమార్గంలో ప్రయాణించే వాహనదారులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం అచ్యుతాపురం కన్వీనర్‌ ఆర్‌ రాము మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను అధికారుల దృష్టికి ఉద్యమంగా తీసుకువెళ్లటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌.కనుమునాయుడు, మారిశెట్టి పరదేశి నాయుడు, బుద్ధ రంగారావు, బి రామ్‌కుమార్‌, కె.బాబురావు పాల్గొన్నారు.మునగపాక : అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డును పునర్నిర్మించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతకాల సేకరణ శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. మండలంలోని నాగులపల్లి మెయిన్‌ రోడ్‌లో శనివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, నాగులపల్లి ప్రజలు అత్యధిక మంది పార్టీలకు అతీతంగా పాల్గొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. అవసరమైతే నిరవధికంగా రోడ్డు దిగ్బంధం చేయాలని, దీనికి వేలాదిగా ప్రజలు రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో రోడ్డు వేసిన వారికి మాత్రమే ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కాండ్రేగుల సదాశివరావు, ఎస్‌ కన్నుమనాయుడు, ఎస్‌ బ్రహ్మాజీ, వివి శ్రీనివాసరావు, కాండ్రేగుల బాబురావు తదితరులు పాల్గొన్నారు.

➡️