లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్‌ఒ

Mar 26,2024 22:04

 ప్రజాశక్తి – సాలూరు : అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలను పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణుచరణ్‌ మంగళవారం పరిశీలించారు. లెక్కింపు కేంద్రాన్ని పార్వతీపురం ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని, స్ట్రాంగ్‌ రూంను సాలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలో అన్ని పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇవిఎం స్ట్రాంగ్‌ రూం ఏర్పాటు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహణకు అంతా సహకరించాలని ఆయన కోరారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్‌ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రచారం తదితర ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్‌ సువిధ యాప్‌ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల డిజిటల్‌ మీడియా విధానంలో ప్రచారానికి విధిగా అనుమతులు పొందాలని చెప్పారు. కరపత్రాలు, పోస్టర్లు, బుక్‌ లెట్లు తదితర ప్రచార సామగ్రిలో ముద్రణ, ప్రచురణ కర్తలు వివరాలు, ముద్రించిన ప్రతుల సంఖ్య విధిగా తెలియజేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విధిగా పాటించాలని, వ్యక్తిగత దూషణలు, కుల, మత, ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టేలా ఉండరాదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సింహాచలం పాల్గొన్నారు.ఎలక్ట్రికల్‌ ఓటింగ్‌ పై అవగానే సీతానగరం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులకు ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తాసిల్దార్‌ ఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటింగ్‌ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ముందస్తు గ్రామాల్లో ఇప్పటికే అవగాహన కలిగించడానికి జరుగుతుందని మొబైల్‌ టీమ్‌ ద్వారా జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్క కీ బోర్డు ఓటింగ్‌ పై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు జి సూర్యదేముడు ఎంవి రమణ ఎంపీడీవో ఎం ఈశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పార్వతీపురం :స్థానిక ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రంను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ శోబిక మంగళ వారం సందర్శించారు. లెక్కింపు కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగు నియోజక వర్గాల లెక్కింపు, పార్లమెంటరీ నియోజకవర్గ లెక్కింపు ఉంటాయని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మీడియా సెంటర్‌, బందోబస్తు, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.సిగల్స్‌ లేని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సీతంపేట : పాలకొండ నియోజకవర్గంలో సిగల్స్‌ లేని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటింగ్‌ సమాచారం నిమిత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్‌ అధికారి కల్పనా కుమారి అన్నారు. మంగళవారం సీతంపేట మండలం సిగల్స్‌ లేని పలు పోలింగ్‌ కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారి పరిశీలించారు. దాసుగుమడ, పెద్దతంకిడి, గుజ్జి, పెద్ద పల్లంకి, చిన్న పల్లంకి, బర్న పోలింగ్‌ కేంద్రాల్లో నెట్‌ వర్క్‌ పరిస్థితిని పరిశీలించి, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. అదే విధంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీతంపేట తహశీల్దార్‌ మహేశ్వరరావు, ఆర్‌ఐ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలిలి బలిజిపేట :ఎన్నికల విధుల్లో సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం ఆర్‌డిఒ కె.హేమలత అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఎన్నికల సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో సందర్శించారు. ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. శిక్షణలో ఇవిఎంలు వినియోగించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ జనార్దన్‌, ఎంఇఒలు సామల సింహాచలం, కె శ్రీనివాసరావు, మాస్టర్‌ ట్రైనీలు ఎం.పైడపు నాయుడు, గుల్ల రామారావు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతులు తీసుకోవాలికురుపాం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు, వాహనాలు, మైక్‌ సెట్‌, ర్యాలీ,సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కురుపాం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వివి రమణ సూచించారు. మంగళవారం ఆయన ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకటించారు .సువిధ ఆన్లైన్‌ ఏప్‌ ద్వారా పూర్తి సమాచారంతో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటు, మైక్‌ సెట్‌, వీడియో వ్యాన్‌, ర్యాలీ నిర్వహించే మార్గం, ఎంతమంది హాజరౌతారు , క్యాంపెయిన్‌ నిర్వహణకు అవసరమైన అనుమతి, కరపత్రాలు ముద్రించి, పంపిణీ, పోస్టర్ల ముద్రణ , వాహనాలు కు మైక్‌ సెట్‌ ఏర్పాటు కు , జనరల్‌ ఏజెంట్‌ కి వాహనం అనుమతి ముందు గా తీసుకుని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.

➡️