వడ్డాదిలో ఉద్రిక్తం

వడ్డాదిలో ఆందోళన చేస్తున్న మహిళలు

కోడి పందేల వద్ద వివాదం

పలు మార్లు ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ-

కోడికత్తితో దాడి చేయడంతో యువకునికి తీవ్ర గాయాలు

నిందితులను శిక్షించాలని బాధిత గ్రూపు వారు ఆందోళన

ప్రజాశక్తి-వడ్డాది

బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోడి పందేల శిబిరం వద్ద మంగళవారం వడ్డాదికి చెందిన యువకుల మధ్య చోటు చేసుకున్న స్వల్ప వివాదం కత్తిపోటుకు దారితీసింది. దీంతో నిందితులను శిక్షించాలని వడ్డాది రెల్లివీధికి చెందిన బాధిత గ్రూపు యువకులు, మహిళలు బుధవారం వడ్డాదిలో ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కనుమ పండగ సందర్భంగా బుచ్చయ్యపేట మండలం వడ్డాది -మంగళాపురం గ్రామాల మధ్య పొలాల్లో మంగళవారం కోడిపందేలు నిర్వహించారు. ఈ పందేలకు వడ్డాదికి చెందిన యువకులు వెళ్లారు. అక్కడ తేజ, శ్రీరామ్‌ గ్రూపుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇది తీవ్రమై ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో స్థానికులు వారిని అక్కడి నుండి పంపించేశారు. బిఎన్‌ రోడ్లో సాయిబాబ గుడి వద్ద మరో మారు రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు గ్రూపుల వారు ఒకరికొకరు ఛాలెంజ్‌ చేసుకున్నారు. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు వారిని సముదాయించి పంపించేశారు. మంగళవారం రాత్రి వడ్డాది సినిమా హాల్‌ వద్ద తిరిగి ఇరు గ్రూపులు ఘర్షణకు దిగాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ కోడి కత్తితో తేజపై దాడి చేయడంతో తేజ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తేజను చోడవరం ప్రభుత్వ హాస్పటల్‌కి తీసుకువెళ్లగా, మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్‌టిఆర్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో వడ్డాదిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తేజపై కోడి కత్తితో దాడి చేయడాన్ని నిరసిస్తూ స్థానిక చెరుకు కాటా ఎదురుగా బిఎన్‌ రోడ్డుపై బాధితుని వర్గానికి చెందిన వారు బుధవారం ఆందోళన చేశారు. దీంతో బిఎన్‌ రోడ్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ డి.ఈశ్వరరావు సిబ్బందితో వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డిఎస్‌పి వి.సుబ్బరాజు, కొత్తకోట సీఐ ఎల్‌.అప్పలనాయుడు వడ్డాది చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తుకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన తేజకు న్యాయం చేయాలని వడ్డాది జంక్షన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. తేజపై దాడి చేసిన ఏడుగురు యువకులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిఎస్‌పి సుబ్బరాజును కోరారు.

➡️