వారి స్థానంలో ఎవరొచ్చినా పిల్లల్ని పంపించం

దుగ్గిరాలలోని అలీనగర్లో అంగన్వాడి కేంద్రం తాళాలు పగలగొట్టకుండా అడ్డుకున్న అంగన్వాడీలు, స్థానికులు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా విలేకర్లు :
అగన్వాడీల సమ్మె నేపథ్యంలో కేంద్రాల తాళాలను అధికారులు పగలగొట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల వారి చర్యలను స్థానికులు, సిపిఎం, టిడిపి, జనసేన, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకుంటున్నారు. సోమవారం మండల కేంద్రమైన దుగ్గిరాల అలినగర్‌లో కేంద్రం తాళాలను పగలగొట్టడానికి అధికారులు రాగా స్థానిక మహిళలు, అంగన్వాడీల అడ్డుకున్నారు. కేంద్రం ఎదుటే బైఠాయించారు. అంగన్వాడీల స్థానంలో ఎవరొచ్చిన తమ పిల్లల్ని కేంద్రాలకు పంపించబోమని పలువురు మహిళలు స్పష్టం చేశారు. తాళాలైతే పగలగొడుతున్నారుగాని పిల్లలకు సరైన ఆహారం పెట్టారా? గర్భిణులు, బాలింతలకు రేషన్‌ ఇచ్చారా? అని ప్రశ్నించారు. అద్దె భవనంలో ఆ కేంద్రం నిర్వహిస్తుండంతో యజమాని సైతం తమకు 10 నెలల అద్దె బకాయిలివ్వాలని ఎదురు తిరగడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తాము సేవలందిస్తున్నా అరకొర జీతాలే ఇస్తున్నారని, మిగతా శాఖల ఉద్యోగులు ఇది గమనించి తమ సమ్మెకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జయ, అన్నపూర్ణ, మేరీ, రిజ్వాన, సునీత, నాగమణి, సిఐటియు నాయకులు జె.బాలరాజు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి నుండి మండల వ్యాప్తంగా ఉన్న 58 అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొడుతున్నారు. సోమవారం వీఆర్వోల సమక్షంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ సిబ్బంది ఈ పనిలో నిమగమయ్యారు. తాళాలు పగలగొట్టిన అంగన్వాడి సెంటర్లను అలానే వదిలేస్తుండడంతో కేంద్రాల్లోని సరుకులు, సామగ్రికి భద్రత ఏమిటనేది ప్రశ్నార్థకమైంది. తాడేపల్లి రూరల్‌ కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, మెల్లెంపూడి తదితర గ్రామాల్లోని 12 కేంద్రాల వద్దకు వచ్చిన అధికారులను సిపిఎం, టిడిపి జనసేన పార్టీల నాయకులు ప్రతిఘటించారు. అంగన్వాడీలకు మద్దతుగా సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఎ.సుబ్బారావు మాట్లాడారు. నాయకులు ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, ఎ.రామారావు, బి.రమేష్‌, ఎస్‌.శ్రీనివాసరావు, కె.మహేశ్వరరావు, డి.అరుణ, ఎం.రాజా, పి.అశోక్‌, జి.రమేష్‌బాబు, ఎన్‌.రామారావు, సిహెచ్‌.సుబ్బారావు, పి.కృష్ణ, బి.సంసోను, కె.సాంబశివరావు, ఎస్కే నాగుల్‌, జేమ్స్‌, చందు నాయక్‌, వి.శ్రీనివాసరావు, ఎం.పాములు, పి.శివనాగేశ్వరరావు, లాల్‌చంద్‌, కృష్ణ పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణంలోని సుందరయ్యనగర్‌, మహానాడులో 17, 23వ రోడ్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం తాళం పగులగొట్టేందుకు సచివాలయ సిబ్బంది రాగా సిపిఎం నాయకలు కొట్టే కరుణాకరరావు, గిరిజ, బాషా, ప్రభాకర్‌రావు, సుధ జయంతి ప్రతిఘటించారు.

➡️