వాలంటీర్లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు

Mar 22,2024 23:28

ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రచారాల్లో ఉద్యోగులు, వాలంటీర్లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఎన్నిక కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల సమావేశాలకు హాజరైన 12 మంది వాలంటీర్లను, ప్రజాప్రతినిధులతో ప్రచారాల్లో ఉన్న ఇద్దరు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ కమిషనర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిందేనని, నిబంధనలు మీరి ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచార సభల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఇటీవల ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పార్టీ అభ్యర్థి తన నివాసంలో నిర్వహించిన రాజకీయ సమావేశానికి స్థానిక సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు హాజరైనట్లు గుర్తించామన్నారు. గుంటూరు ఆర్‌డిఒ నివేదిక మేరకు సమావేశానికి హాజరైన అల్లాడి స్వాతి, ఎస్‌.సుధాకృష్ణవేణి, కె.నాగావర్దనిదేవి, యు.పుష్పాంజలి, డి.నీలిమ, ఎం.నాగేశ్వరరావు, ఎ.భాగ్యలక్ష్మి, ఎం.శిరీష, డి.శిరీష, బి.సాయి, పి.భాగ్యశ్రీ, పి.సురేంద్రబాబును వాలంటీర్ల విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. జిఎంసికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇద్దరు మినహా అందరు రిపోర్ట్‌ చేశారని, రిపోర్ట్‌ చేయకుండా ఎన్నికల ప్రచారంలో ఉన్న ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులైన నాగకుమార్‌ (పర్సనల్‌ అసిస్టెంట్‌), సతీష్‌ (డ్రైవర్‌)ను విధుల నుండి తొలగిం చామన్నారు. డిప్యుటీ మేయర్‌ వద్ద ఉన్న జిఎంసి ఔట్సోర్సింగ్‌ సిబ్బందంతా రిపోర్ట్‌ చేశారని తెలిపారు.కొరవడిన నిఘాప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధిప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాడు మండల వాలంటీర్లకు సంబంధించిన చర్యలు ఎంపిడిఒ తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు భేఖాతరు చేస్తూ వైసిపి అభ్యర్థులు తమ రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు, ఉద్యోగులను ఉపయోగిస్తున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినా, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఫిర్యాదుచేస్తే అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారంతా తమ శాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశించినా ఇంకా కొంతమంది పిఎలు, పిఎస్‌లు ప్రజా ప్రతినిధుల వద్ద కొనసాగుతున్నట్టు తెలిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో టిడిపి హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధుల వద్ద పనిచేసిన వారూ సంబంధిత నాయకుల వద్ద అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నా నిఘా కొరవడింది.

➡️