వాలంటీర్లే సంక్షేమ పథకాల వారధులు : ‘మేడా’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులని, వారి సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆగేపాటి అమర్నాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పురపాలక కార్యాలయం, మండల పరిషత్‌ అభివద్ధి కార్యాలయంలోనూ వేరువేరుగా వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యుత్తమ సేవలందించడంతోపాటు విధివిధానాలలో అలసత్వం లేకుండా ప్రజలకు సేవలు అందించినందుకు గానూ వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంకిత భావంతో సేవలందించిన వాలంటీర్లను సత్కరించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చి సంక్షేమాన్ని ప్రజల గుమ్మం వద్దకు చేర్చారని, ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పరితపించే జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు పేరిట కుల, మత, వర్గ భేదం లేకుండా రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, తహశీల్దారు ఇన్బనాధన్‌, ఎంపిడిఒ మోహనరంగారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, సచివాలయాల కన్వీనర్‌ మందరం గంగిరెడ్డి, ఊటుకూరు, ఎంజీపురం ఎంపిటిసిలు నాగ చంద్రశేఖర్‌రెడ్డి, మధుబాబు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️