విఒఎలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

Dec 24,2023 21:35

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: విఒఎలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని, మూడేళ్ల కాలపరిమితి జీవో రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో విఒఎల సంఘం జిల్లా నాయకులు ధర్మారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యమ్మల మన్మధరావు, శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు వి.ఇందిర, సిఐటియు కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామంలో విఒఎలు ఎన్నో సేవలు అందిస్తున్నారని, విఒఎల సేవల వల్ల ప్రభుత్వానికి ఎంతో పేరు వస్తుందని, గ్రామంలో కొత్త గ్రూప్‌ ఏర్పాటు చేయడం బ్యాంకు లింకేజీలు ఇప్పించడం శ్రీనిధి అప్పులు ఇప్పించడం వసూలు చేయడం, రాజకీయ నాయకులు మీటింగులకు గ్రామస్తులను కదిలించడం వంటి అనేక సేవలు చేస్తున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం విఒఎలను గుర్తించడం లేదన్నారు. మూడేళ్ల కాల పరిమితి జీవో రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, రూ.10 లక్షలతో గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని, విఒఎల మేర్జ్‌ ఆపాలని, అన్ని బకాయిలు చెల్లించాలని, మెర్జ్‌ వల్ల నష్టపోయిన విఒఎలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విఒఎ సంఘం నాయకులు సుందరరావు, శ్రీదేవి, రవణమ్మ, కుమారి, అన్ని మండలాల నుంచి విఒఎలు పాల్గొన్నారు.

➡️