విద్యార్థులను పుస్తకపఠనం వైపు మళ్లించండి

నరసరావుపేట: స్థానిక పల్నాడు రోడ్డులోని శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంక దారి సుబ్బరత్నమ్మ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠకులతో, విద్యార్థులతో ఆమె మాట్లాడారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు అవసరమైన అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఇంకా ఏమైనా పుస్తకాలు అవసరమైతే కనుక గ్రంథాలయ అధికారి వద్ద గల ఆన్‌ డిమాండ్‌ పుస్త కంలో నమోదు చేస్తే, ఆయా పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి శాఖా గ్రంథాలయానికి సరఫరా చేస్తారని చెప్పారు. అనంతరం గ్రంథాలయ భవనాన్ని సందర్శించారు. తగిన మరమ్మతులు చేయించాలని చెప్పారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు రానున్న వేసవి కాలంలో గ్రంథాలయాలకు రావాలని, జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోవాలని అన్నారు. నేటి జీవితంలో విద్యార్థులు అధికంగా సెల్‌ ఫోన్లకే అతుక్కుపోతున్నారని, ఈ విషయమై వారి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వారిని పుస్తక పఠనం వైపు మళ్లించాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 97 శాఖా గ్రంథాలయాలను పాఠకులు ,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️