శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

మాక్‌ డ్రిల్‌లో పాల్గొన్న ఎస్‌పి, ఎఎస్‌పి, డిఎస్‌పిలు, పోలీసు బలగాలు

ప్రజాశక్తి-అనకాపల్లి

జూన్‌ 1వ తేదీన ఎగ్జిట్‌ పోల్స్‌, జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలు -2024 కౌంటింగ్‌ ఉన్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి కెవి.మురళీకృష్ణ హెచ్చరించారు. శాంతిభద్రతలను పరిరక్షించటమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ సమక్షంలో, డీఎస్పీ పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్మ్డ్‌ రిజర్వు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ సిబ్బందితో అనకాపల్లి పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద గురువారం మాబ్‌ ఆపరేషన్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, 144 సెక్షన్‌ అమల్లో ఉన్న సందర్భంలో, ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు స్పందించాల్సిన తీరుపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అక్రమ జన సమూహాలను కంట్రోల్‌ చేయడానికి మొదటగా వార్నింగ్‌ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్‌ అనుమతితో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీఛార్జ్‌, ఆ తర్వాత ఫైర్‌ డిపార్ట్మెంట్‌ వారితో వాటర్‌ కెనాన్‌ ప్రయోగించుట, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ ఫైరింగ్‌, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని ఎడల ఫైరింగ్‌ చేయుట వంటివి ఈ మాక్‌ డ్రిల్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ అల్లరి మూకలను అణచి వేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫైర్‌ సర్వీస్‌ అధికారి నర్సింగరావు, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్‌పి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్‌, డిఎస్‌పిలు పి.నాగేశ్వరరావు, ఎస్‌.అప్పలరాజు, కెవి.సత్యనారాయణ, జిఆర్‌ఆర్‌.మోహన్‌, అప్పారావు, ఎం.ఉపేంద్రబాబు, ట్రైనీ డీఎస్పీ భవ్య, ఇన్‌స్పెక్టర్లు మన్మధరావు, సతీష్‌, శంకరరావు, శ్రీనివాసరావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️