విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Mar 7,2024 21:07

ప్రజాశక్తి – సీతంపేట : విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు, హాస్టల్‌ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు దృష్టిసారించాలని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకరరావు సూచించారు. మండలంలోని గురువారం పలు పాఠశాలలను పరిశీలించారు. తొలుత హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం సీతంపేట ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని బ్లాకులను పరిశీలించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మందులు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఐటిడిఎలోని సెక్టోరియల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో ఎఎన్‌ఎంల భర్తీకి చర్యలు తీసుకొంటామన్నారు. అన్ని పాఠశాలలకు వైద్య సిబ్బంది తరుచుగా వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సికిల్‌సెల్‌ పరీక్షలు అందరికీ చేయాలన్నారు. వసతి గృహాల్లో నాలుగో తరగతి ఉద్యోగులను నియమించేలా చర్యలు తీసుకొంటామన్నారు. విడివికెలను అభివృద్ధి చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో జరుగుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన వారందరికీ అటవీ పట్టాలివ్వాలని సూచించారు. వారికి రైతు భరోసా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి ముందు గిరిజన సంఘాలు, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అంతకుముందు మెలియాపుట్టిలో పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వి.కళావతి, ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి, ఎపిఒ రోసిరెడ్డి, డిడి అన్నదొర, ఏరియా ఆసుపత్రి సూపరింటెడెంట్‌ శ్రీనివాసరావు, డి.కృష్ణకుమార్‌, జిసిసి డిఎం సంధ్యారాణి, పిహెచ్‌ఒ గణేష్‌, పిఎఒ హరికృష్ణ, ఐటిడిఎలోని అన్ని శాఖల అధికారులు, గిరిజన జెఎసి రాష్ట్ర నాయకులు బిడ్డిక తేజేశ్వరరావు, గిరిజన సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.జిఒ 3ను పునరుద్ధరించాలని చైర్మన్‌కు యుటిఎఫ్‌ వినతిజిఒ నెంబరు 3ను పునరుద్ధరించాలని కోరుతూ యుటిఎఫ్‌ నాయకులు చైర్మన్‌కు వినతిని అందజేశారు. అలాగే ఐటిడిఎ డిప్యూటీ డిఇఒ పోస్ట్‌ ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయాలని, సవర భాష వాలంటీర్లను మార్చి, ఏప్రిల్‌లో కొనసాగించాలని, డిఎస్‌సిలో సిఆర్‌టిలను పోస్టులు కలపరాదని కోరారు. వినతిని అందజేసిన వారిలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.కృష్ణారావు, గౌరవాధ్యక్షులు ఎ.భాస్కరరావు తదితరులు ఉన్నారు.

➡️