విద్యా రంగ సమస్యలపై అలుపెరగని పోరాటం

ఎస్‌ఎఫ్‌ఐ 54వ ఆవిర్భావ దినోత్సవంలో నాయకులుప్రజాశక్తి- జమ్మలమడుగు భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 1970 డిసెంబర్‌ 30న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చిన్న విద్యార్థి సంఘంగా ఏర్పడి ఇవాళ అనేక రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అతి పెద్ద విద్యార్థి సంఘంగా వృద్ధి చెంది 54వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయమని జమ్మలమడుగు పట్టణ సిపిఎం నూతన కార్యదర్శి ఏసుదాసు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు ఎ. వినరుకుమార్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ స్తూపం వద్ద విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం విద్యారంగ సమస్యల పైన పోరాడుతుందన్నారు. విద్యారంగ సమస్యల పరిస్కారం కోసం అధ్యయనం-పోరాటం అనే నినాదంతో, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు.. ఇప్పటివరకు పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను సంఘటితం చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుందని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ విద్యారంగం బలోపేతం కోసం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వారు తెలిపారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చి బలవంతంగా రాష్ట్రాలలో అమలు చేస్తుందన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న పేద విద్యార్థులంతా విద్యకు దూ రమవుతున్నారని వారు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీల అమలుకు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకొక జిఒ తీసుకొస్తూ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తోందని చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని ఎక్కడా అమలు చేయకున్న రాష్ట్రంలో మాత్రం శరవేగంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే జిఒ నంబర్‌ 117 తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రాథమిక పాఠశాలలో 3,4,5 చదివే విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తుందన్నారు. జిఒ నంబర్‌ 77తో పీజీ చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో రీయింబర్స్‌ మెంట్‌ ఆపేసి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కరించాలని ఇప్పటికే అనేక విధాలుగా ఆందోళనలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా పోలీసులతో అక్రమ అరెస్ట్‌లు చేయించి ఉద్యమాలను అణచివేయాలని చూసిందని చెప్పారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, విద్యా రంగ సమస్యపై నిరంతరమూ పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం : మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి యార్రంపల్లి అజరు అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు రాహుల్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ 54 సంవత్సరాలు పాటు అలుపెరగని రీతిలో విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా చెప్పుకో గలిగే ఒకే ఒక్క సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అన్నారు. అనంతరం మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చిన్ను, నాయక్‌, అజరు, విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️