విమానాశ్రయ నిర్మాణానికి తాత్కాలిక విద్యుత్‌

Mar 5,2024 21:21

ప్రజాశక్తి- భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి తాత్కాళికంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గత రెండు రోజులు నుంచి ఈ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం విమానాశ్రయ నిర్మాణ సంస్థ రూ.2కోట్లను విద్యుత్‌శాఖకు చెల్లించినట్లు సమాచారం. విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తయ్యేలోపు ముక్కాం వెళ్లే రహదారిలో రామచంద్రపేట వద్ద కేటాయించిన స్థలంలో సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీని కోసం రెవెన్యూ అధికారులు స్థలాన్ని కూడా కేటాయించారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు 2200 ఎకరాల్లో గత కొన్ని రోజులు నుంచి శరవేగంగా జరుగుతున్నాయి. కాని ఇంత వరకు విద్యుత్‌ సరఫరా లేక జనరేటర్స్‌తో పనులు జరుగుతున్నాయి. ఇటీవలి నిర్మాణ సంస్థ 2కోట్లు రూపాయలను ఎపిఇపిడిసిఎల్‌ సంస్థకు విద్యుత్‌ సరఫరా కోసం చెల్లించింది. దీంతో జాతీయ రహదారిలోని ఏ.రావివలస జంక్షన్‌లో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి సరఫరా చేసేందుకు నిర్ణయించారు. అక్కడ నుంచి విద్యుత్‌ స్తంబాలు వేసి కొత్త లైను ఇవ్వనున్నారు. ఇందుకోసం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో 5000కె.వి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా సబ్‌స్టేషన్‌లో జరుగుతున్నాయి. ప్రజలకు తప్పని విద్యుత్‌ ఇబ్బందులువిద్యుత్‌ సరఫరా చేసేందుకు పనులు జరుగుతుండడంతో గత రెండు రోజులు నుంచి ఏ.రావివలస కూడలి నుంచి చేపలకంచేరు వెళ్లే రహదారిలోని వివిధ గ్రామాలకు విద్యుత్‌ కష్టాలు ఏర్పడ్డాయి. విద్యుత్‌ లైన్లు వేస్తుండడంతో ప్రస్తుతం అప్పుడప్పుడు విద్యుత్‌ను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్డడింది. దీంతో ఏ.రావివలస, దల్లిపేట, గూడెపువలస, బైరెడ్డిపాలెం, చేపలకంచేరు, రెడ్డికంచేరు పంచాయతీల్లోని వివిధ గ్రామలకు ఈ విద్యుత్‌ సమస్యలు ఏర్పడనున్నాయి.విద్యుత్‌ సరఫరాకు పనులు ప్రారంభించాంవిమానాశ్రయ నిర్మాణానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు పనులు ప్రారంభించాం. ఏ.రావివలస కూడలిలోని సబ్‌స్టేషన్‌లో 5000 కె.వి కెపాసిటీతో ట్రాన్స్‌ఫార్మర్‌ వేస్తాం. దీనికి సంబంధించిన సొమ్మును కూడా నిర్మాణ సంస్థ చెల్లించింది. కొత్తగా విద్యుత్‌ లైను వేస్తున్నందున ప్రజలకు కొంత విద్యుత్‌ సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ వారికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నాం. – మస్తాన్‌ వలి, విద్యుత్‌ శాఖ ఎఇ, భోగాపురం

➡️