‘విశ్వకర్మ యోజన’ కేవలం బిజెపికేనా..?

Feb 26,2024 21:28
ఫొటో : నిరసన తెలియజేస్తున్న దళిత సంఘర్షణ సమితి నాయకులు

ఫొటో : నిరసన తెలియజేస్తున్న దళిత సంఘర్షణ సమితి నాయకులు
‘విశ్వకర్మ యోజన’ కేవలం బిజెపికేనా..?
– దళిత సంఘర్షణ సమితి విమర్శలు
ప్రజాశక్తి-కావలి : విశ్వకర్మ యోజన పథకం కేవలం బిజెపి కార్యకర్తలకేనా.. రుణాలు పొందడానికి బడుగు వర్గాలు పనికిరారా.. అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి ప్రశ్నించారు. సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డిఒ శీనానాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ నరేంద్ర నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వం రూ.10వేలకోట్లతో చేతి వృత్తుల వారికి చిన్న వ్యాపారస్తులకు లక్ష నుంచి 10లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి దళితులు గిరిజనులకు రుణ సౌకర్యం లేకుండా బిజెపి కార్యకర్తల వరకే దరఖాస్తు చేసుకొన్నారని ఆరోపించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగే ఈ పథకం డబ్బున్న కోటీశ్వరులకే వస్తుందన్నారు. అట్టడుగు వర్గాలు, చేతి వృత్తుల వారు బడుగు వర్గాలు ప్రభుత్వాలకు కనిపించడం లేదన్నారు. ధనవంతులకే స్టేట్‌ బ్యాంక్‌ వారు పథకాలు ఇస్తున్నారని, పేద వారికి ఇవ్వడం లేదన్నారు. లక్షలకోట్ల రూపాయిలు సర్వీస్‌ ఛార్జీల కింద గుంజి పెట్టుబడీదారులకే ఇస్తుంటే నరేంద్ర మోదీ కార్పొరేట్ల రుణమాఫీ రద్దు చేస్తున్నారని తెలిపారు. బడుగు వర్గాలకు రాకుండా చేసే ఈ పథకంపై తెలుగుదేశం, వైసిపి అడగక పోవడం పేదవర్గాల వారికి ద్రోహం చేయడమేనన్నారు. జగనన్న ప్రభుత్వం దళిత, గిరిజనుల బడుగు వర్గాల మైనార్టీల కార్పొరేషన్‌ల వేల కోట్ల రూపాయిలు అమ్మఒడి పేరిట కార్పొరేట్‌ స్కూళ్లకు వేసి బడుగు వర్గాలను ఆర్థికంగా దెబ్బతీశాడన్నారు. ఈ విధంగా బిజెపి కూడా ఈ పంథాలోకి వెళ్లడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కలెక్టర్‌ స్థాయి కమిటీ వేసి, పేదరికం ప్రాతిపదికన ఇవ్వాలే కాని పార్టీ ప్రాతిపదికన ఇవ్వకూడదన్నారు. ప్రభుత్వ సొమ్ము పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు జరుగుమల్లి విజయరత్నం, గిరిజన నాయకులు చౌటూరి లక్ష్మయ్య, కత్తి వెంకట రత్నం, ముస్లిముల నాయకులు ఎస్‌కె.హుస్సేన్‌, ఖాదర్‌భాషా, సుబ్రమణ్యం, విడవలూరు వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️