విస్తారంగా వర్షాలు

Mar 20,2024 21:12

 ప్రజాశక్తి-విజయనగరం/పాలకొండ  :  బంగాళా ఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అడపా దడపా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడా మొక్కజొన్నకు స్వల్ప నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా చీపురుపల్లి మండలంలో 136.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా రామభద్రపురం, వేపాడ, కొత్తవలస మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. గరివిడి మండలంలో 131.2మి.మీ, దత్తిరాజేరు మండలంలో 53.2మి.మీ, మెరకముడిదాం 36, మెంటాడ 34.2, గజపతినగరం 32.4, బొండపల్లి 32, సంతకవిటి 28.2, విజయనగరం 23.6, గుర్ల 20.8, రేగిడి 18.8, తెర్లాంలో 18.6, డెంకాడ 16.2 మి.మీ. వర్షం కురిసింది. తక్కువగా నెల్లిమర్లలో 8.6, బాడంగి 8.2, వరగర 6.6, బొబ్బిలి 4.4, గంట్యాడ 3.8, భోగాపురం 3.6, పూసపాటిరేగ 2.8, లక్కవరపుకోట, శృంగవరపుకోట, జామి మండలాల్లో 2.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. గాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడికి కొంత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సీతంపేటలో కుండపోత సీతంపేట : ద్రోణి ప్రభావంతో సీతంపేటలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు, విద్యార్థులకు కొంత ఆటంకం కలిగింది. ఈ వర్షం వేసవి పంటలు కూడా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుపాం ఏజెన్సీలో చిరుజల్లులు కురుపాం : ద్రోణి ప్రభావంతో కురుపాం ఏజెన్సీలో బుధవారం ఉదయం అక్కడ అక్కడ చిరుజల్లులు పడ్డాయి. దీంతో వేసవి ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిన మన్యం ప్రజలకు ఈ చిరుజల్లులతో కొంత ఉపశమనం లభించింది. చిరుజల్లులు వల్ల జీడి, మామిడి పూత, పింజ దశలో ఉండటంతో రాలిపోయి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని జీడి మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

➡️