వీరానగర్‌ ఇళ్లకు పన్నులు వేయాలి

వీరానగర్‌  వాసుల ధర్నా

వారం రోజుల్లో స్పందించకుంటే జివిఎంసి జోనల్‌ కార్యాలయంలో నివాసం

సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలో కార్పొరేటర్‌ గంగారావు

ప్రజాశక్తి- వేపగుంట : వీరానగర్‌ కాలనీకి వారం రోజుల్లో ఇంటి పన్నులు వేయకుంటే, జోనల్‌ కార్యాలయాన్నే ఇల్లుగా మార్చి అందులో నివాసముంటామని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు హెచ్చరించారు. సోమవారం జివిఎంసి ఎనిమిదో జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, 97వ వార్డు పరిధిలోని వీరానగర్‌లో పదేళ్లుగా 50కుటుంబాలు నివాసముంటున్నాయన్నారు. వీరి ఇళ్లకు పన్నులు వేయకపోవడంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, దీనిపై అనేక దఫాలుగా అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు చెప్పుకున్నా ఫలితం లేదని వాపోయారు. దీనిపై గతంతో జివిఎంసి కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, వారం రోజుల్లోపు వీరానగర్‌లోని ఇళ్లకు పన్నులు వేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జోనల్‌ కార్యాలయంలో నివాసమేర్పరచుకుంటామని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్‌, పెందుర్తి జోన్‌ కార్యదర్శి బి రమణి, కె అప్పలనాయుడు, శ్రీను, గౌరినాయుడు, అప్పారావు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న వీరానగర్‌ వాసులు

➡️