వేగంగా ఎన్నికల కసరత్తు

Jan 29,2024 00:11

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంది. ఓటర్ల తుది జాబితాలను ముద్రించి అధికారులు అన్ని రాజకీయ పార్టీలకు అందించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కసరత్తులో భాగంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కీలకమైన అధికారులను బదిలీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేసిన వారు, సొంత జిల్లాకు చెరదినవారికి బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుశాఖలో సిఐలు, ఎస్‌ఐలు బదిలీల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు గుంటూరు రేంజి పరిధిలో 40 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా పరిధిలో 30 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీ అయ్యారు. జిల్లాలోని నర్సరావుపేట, తెనాలి, మంగళగిరి, గుంటూరు, పిడుగురాళ్ల తదితర మునిసిపాలిటీల్లో కమిషనర్లు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు 10 మంది బదిలీ అయ్యారు. తాజాగా ఎంపీడీవోలను జోనల స్థాయి బదిలీకి ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేసే వారిని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పంపుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న వారిని గుంటూరు జిల్లాలోని వివిధ మండలాలకు బదిలీ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో డిప్యూటీ కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సంబంధించి కూడా ఈనెల 31లోపు ఉత్తర్వులు రానున్నట్టు తెలిసింది. వచ్చే నెల 10వ తేదీలోగా అన్ని మండలాల్లో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సిఐలు, ఎస్‌ఐలు, మునిసిపల్‌ కమిషనర్ల బదిలీల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంతమంది ఐఎఎస్‌ అధికారులను కూడా ఉమ్మడి జిల్లా నుంచి బదిలీ అవుతారని తెలిసింది. మండలాల్లో తహశీల్దార్ల బదిలీలకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందిన వారికి సోమవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌లను చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తహశీల్దార్ల బదిలీకి ముందే ఈ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. ఈనెల 9వ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం ఆదేశించిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి.రాజకుమారి ప్రజాశక్తి ప్రతినిధికి తెలిపారు. తహశీల్దార్‌ల బదిలీ ఉత్తర్వులు వచ్చినా 9వ తేదీ తరువాత రిలీవ్‌ చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మూడేళ్లు దాటిన జిల్లా అధికారులు జిల్లా స్థాయిలో ఆరుగురు ఉన్నారు. సొంత జిల్లాకు చెందిన అధికారులు కూడా మరో నలుగురు ఉన్నారని సమాచారం. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్‌పి స్థాయిలో సొంతజిల్లావారు లేకపోయినా మూడేళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారుల పోస్టులు ఇంకా భర్తీ చేసేందుకు వారం రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు.

➡️