‘వైఎస్‌ఆర్‌ ఆసరా’తో మహిళలకు బాసట

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాలకు బాసటగా నిలిచిందని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభ నుండి 4వ విడత వైఎస్సార్‌ ఆసరా పథకం ఆర్థిక సాయం మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ విసి హాలు నుండి జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 11.04.2019 నాటికి పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల్లో బకాయి పడిన రుణ మొత్తాన్ని వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వమే 4 విడతలుగా వారి పొదుపు సంఘాల ఖాతాలకు జమ చేసే 4వ విడత ఆర్ధిక సహాయాన్ని ఈ రోజు విడుదల చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం 4వ విడత ‘వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 24,948 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2,34,520 మంది మహిళలకు మంజూరైన రూ.223.11 కోట్ల మెగా చెక్కును జాయింట్‌ కలెక్టర్‌ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహిళలు ఆర్ధిక స్వావలంభన దిశగా అడుగులు వేయలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా అందించే ఆర్ధిక సాయం స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు. ఈ సాయం పొదుపు సంఘాల మహిళల జీవనోపాధికి బాటలు వేసి వారి ఆర్ధిక ప్రగతికి ఆసరాగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, మహిళా సంఘాల లబ్ధిదారులు, తదితరులు హాజరయ్యారు.

➡️