వైసిపికి మరో షాక్‌

Feb 17,2024 21:21

 ప్రజాశక్తి- మెంటాడ : మండలంలో అధికార పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. సుమారు 15 గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు వైసిపికి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించారు. అధికార పార్టీలో ఇమడలేక పోతున్నామని ఆ పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే వారంతా జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు.మండలంలోని జయతి సమీపంలో తోటలో శనివారం వైసిపికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపిటిసి చింత కాశీనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్‌ చింత సీతమ్మ, మీసాలపేట మాజీ సర్పంచ్‌ లెంక నారాయణ, రాబంద మాజీ సర్పంచ్‌ రామారావు, కో-ఆపరేటివ్‌ డైరెక్టర్‌ మజ్జి అప్పలనాయుడు తదితర ముఖ్యులు ఉన్నారు. వీరితోపాటు వారి అనుచరులు, ప్రధాన కార్యకర్తలు సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. జనసేన సాలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గేదెల రామకృష్ణ దీనికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు అధికార పార్టీలో ఎదురవుతున్న అవమానాలపై ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద, మన్ననలు దక్కలేదని వాపోయారు. గ్రామాల్లో అభివృద్ధి ఎండమావిగా మారిందని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. తమ సేవలను వాడుకొని నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో కొనసాగలేకపోతున్నామని, ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. చేరిక తేదీని ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయించి, భారీ సంఖ్యలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో జనసేనలో చేరతామని వెల్లడించారు. జనసేన నేత గేదెల రామకృష్ణ మాట్లాడుతూ వీరి నిర్ణయాన్ని అభినందిస్తూ, తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు.దెబ్బ మీద దెబ్బఇటీవలే పలు గ్రామాలకు చెందిన వైసిపి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, మరికొందరు వైసిపి నాయకులు ఆ పార్టీకి రాంరాం చెప్పి జనసేనలో చేరాలని నిర్ణయించడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. దెబ్బమీద దెబ్బతో ఆ పార్టీ నేతలు విలవిల్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కూనిబిల్లి త్రినాథ్‌ ,పి.శేఖర్‌, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️