వైసిపిలో భగ్గుమన్న ముఠా పోరు

పోలీసు స్టేషన్‌ వద్ద గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలమధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే వర్గీయులైన జీడిసిసి బ్యాంక్‌ డైరెక్టర్‌ వట్టి కొండ ఆంజనేయులు నరసరావుపేట జడ్పిటిసి పి చిట్టిబాబు, పౌడ చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌ బాబు, రొంపిచర్ల ఎంపిపి గడ్డం వెంకట్రావు ఇతర ముఖ్య నాయకులు స్థానిక ప్రకాష్‌ నగర్‌ లోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని తన సామాజిక వర్గానికి చెందిన నాయకుల కంటే ఎక్కువగా ఎస్‌.సి,ఎస్టీ, బిసిలకు పదవులు కట్టబెట్టారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్‌ ఇస్తారని పోటీ చేసి గెలుస్తారని అన్నారు. ఈ సమయంలో సయ్యద్‌ హుస్సేన్‌ అనే నాయకుడు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే అనుచరులను దూషించాడు. ముందు సర్ది చెప్పగా వినకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారు. తరువాత సయ్యద్‌ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఉన్న ఒక కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఎస్‌.ఏ హనీఫ్‌ తన అనుచరుడ్ని అక్రమంగా అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలని డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి వర్గీలను వెంటబెట్టుకొని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు డాక్టర్‌ గజ్జల వర్గీయులకు వాగ్వివాదం చోటుచేసుకుంది.రాత్రి 10 గంటల వరకు హనీఫ్‌ అనుచరుడు సయ్యద్‌ హుస్సేన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు పూర్వాపరాలు గురించి అడిగిన విలేకరులకు పోలీసులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు.

➡️