వైసిపి, టిడిపి, విధానాలను తిప్పి కొట్టండి

Mar 1,2024 20:56

ప్రజాశక్తి – కొమరాడ: రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంలో బిజెపితో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ దీనివల్ల మన రాష్ట్రానికి ద్రోహం చేసేలా ఈ మూడు పార్టీల విధానాలు ఉన్నాయని, వీటిని తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వాకాడ ఇందిరా పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా గోడ పత్రికను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రజావ్యతిరేక విధానాలకు ఈ మూడు పార్టీలు మద్దతు పలుకుతూ రాష్ట్రంలో కుస్తీ పట్టేలా నటిస్తున్నాయని, కావున ప్రజలు ఈ పార్టీలను నమ్మొద్దు అన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బిజెపికి మద్దతు పలికేలా ఉన్నాయని తెలిపారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై బిజెపి ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే పోలీసు కాల్పుల్లో ఓ రైతు మృతిచెందగా, అనేక మంది గాయాలపాలయ్యారన్నారు. ఈ మూడు పార్టీలు దీనిపై స్పందించిన పరిస్థితి నేటికీ లేకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తగాదాలు పక్కనపెట్టి పార్టీలన్నీ ముందుకు అన్ని వచ్చేలా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, రామారావు వెంకటేశు, పెంటయ్య, రామయ్య పాల్గొన్నారు.

➡️