వైసీపీలో టికెట్ల టెన్షన్‌

ప్రజాశక్తి – కడప ప్రతినిధివైసిపిలో టికెట్ల టెన్షన్‌ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ నేడో, రేపో ప్రకటన వెలువడనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తుది విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్‌సభ, 175 అసెం బ్లీలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 విడతలుగా పలు అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. శని వారం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు అభ్యర్థిత్వాల పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట సమన్వయకర్తను మినహా మిగిలిన 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కడప, అన్నమయ్య జిల్లాలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుంది. రాజంపేట అభ్యర్థిత్వాన్ని మార్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏఏ స్థానాలకు ఎవరి పేర్లు గల్లతు కానున్నాయి. ఎవరి పేర్లు పదిలంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని పెండింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థిత్వాలను దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది.

➡️