శారదా నదిలో జెసిబితో ఇసుక తవ్వకాలు అడ్డగింత

ఎస్‌ఐ సమక్షంలో ఘర్షణ పడుతున్న దృశ్యం

ప్రజాశక్తి-దేవరాపల్లి

మండలంలోని తెనుగుపూడి శారదానది పరీవాహక ప్రాంతంలో ఎటువంటి మైనింగ్‌ అనుమతులు లేకుండా జెసిబి సహాయంతో ఇసుక తరలిస్తుండడంతో మంగళవారం ఆ గ్రామ ప్రజలంతా ఏకమై అడ్డుకున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ, తహశీల్దార్‌కు గ్రామస్తుల సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ డి.నాగేంద్ర జెసిబితో ఇసుక తవ్వకాల పనులను నిలుపుదల చేశారు. అయితే ఇసుక తరలింపును ఆపాలని స్థానికులు ఎస్‌ఐను కోరగా, ఈ ట్రాక్టర్లకు ఇసుక టోకెన్లు తహశీల్దార్‌ మంజూరు చేసి ఉన్నారని ఎస్‌ఐ స్పష్టం చేశారు. దీంతో మైనింగ్‌కు ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా ఇసుక తరలింపునకు, జెసిబితో తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని తహశీల్దారును ప్రశ్నించేందుకు మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, పెంటకోట వెంకటరమణ, చామంతుల చిన్న, దాసరి గోవింద, గరిమిశెట్టి శ్రీను, కొట్యాడ సామాలు, గ్రామస్తులు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే వారికి చేదు అనుభవం ఎదురైంది. వారంతా మధ్యాహ్నం ఒంటిగంటకు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా, సాయంత్రం 4 గంటలు దాటినా తహశీల్దార్‌ రాలేదు. దీంతో వారంతా వెనుదిరిగారు. మార్గమధ్యలోకి వెళ్లే సరికి గర్సింగి వెళ్లాల్సిన ఇసుక ట్రాక్టర్లు దేవరాపల్లి వైపు వస్తుండడతో వారు మళ్లీ ఎస్‌ఐ నాగేంద్రకు ఫోన్‌ చేయడంతో పోలీసులు ఆ ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ మాట్లాడుతూ ఇసుక తవ్వుతున్న జెసిబి, రెండు ఇసుక ట్రాక్టర్లను తహశీల్దార్‌ కోర్టులో హాజరు పర్చామని, తహశీల్దారు వెరిఫికేషన్‌ చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై తహశీల్దార్‌ను వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ప్రభుత్వ పనుల పేరుతో టోకెన్లు.. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు ఈ సందర్భంగా తెనుగుపూడి గ్రామ యువకులు మాట్లాడుతూ తెనుగుపూడి వద్ద శారదానది పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ప్రభుత్వ నిర్మాణ పనుల పేరుతో తహశీల్దారు టోకెన్లు ఇవ్వడంతో, వాటితో అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక ఎక్కడ తవ్వాలో, ఆ ఇసుకను ఎక్కడికి తరలిస్తారో అనే విషయాలతో టోకెన్ల ఇవ్వాల్సి ఉండగా, ఆ వివరాలు ఏమీ లేకుండానే అధికార పార్టీ పెద్దలకు తలొగ్గి ఖాళీ టోకెన్లపై తహశీల్దారు సంతకాలు చేసి ఇస్తున్నారని విమర్శించారు. దీంతో ఒకే టోకెన్‌తో రోజంతా అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. జెసిబితో తవ్వకాలు చేయకూడదన్న నిబంధనలు కూడా పాటించడం లేదని తెలిపారు. ఒక వైపు ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు పోరాడుతుంటే పట్టించుకోవాల్సిన అధికారులు ఇలా అడ్డగోలుగా ఇసుక తరలింపునకు సహకరించడం సరికాదని వారు మండిపడ్డారు. వ్యక్తిపై ఉప సర్పంచ్‌ దాడి.. పోలీసులకు ఫిర్కాదుఇసుక తవ్వకాలపై చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.నాగేంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని ఇసుక తవ్వకాల పనులు నిలుపుదల చేసిన సమయంలో, ఆయన సమక్షంలోనే స్థానిక ఉపసర్పంచ్‌ కాటిపాము నాయుడు అదే గ్రామానికి చెందిన భీమిని పోతురాజుపై దాడి చేశారు. ఈ విషయంపై పోతురాజు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

➡️