శిలాఫలకాలు కాదు.. ప్రాజెక్టు నిర్మించాలి

ప్రజాశక్తి-పుల్లలచెరువు: పల్నాడు జిల్లాలో ఉన్న వరికపూడిసెల ప్రాజెక్టుకు నిధులను కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ప్రాజెక్టు సాధన సమితి డిమాండ్‌ చేసింది. బుధవారం మండల కేంద్రమైన పుల్లలచెరువులో వరికపూడిసెల ప్రాజెక్ట్‌ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు కె హనుమంతరెడ్డి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, కారం పూడి, పుల్లలచెరువు, బొల్లాపల్లి, యర్రగొండపాలెం మండలాల్లోని 1,29,454 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ప్రజలకు తాగునీరు లేక ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 150 గ్రామాల్లో త్రాగునీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఐదు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా సిపిఐ నాయకులు చెన్నయ్య, గురునాథం, సిపిఎం నాయకులు బొజ్జా వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు సాధన సమితి సభ్యుడు పల్నాడు శీను, అనంతరామిరెడ్డి మాట్లాడారు. అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️