షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అద్దె గోల్‌ మాల్‌

Mar 7,2024 21:05

ప్రజాశక్తి -సాలూరు : స్థానిక మున్సిపల్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక షాపు అద్దె గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ షాపునకు సంబంధించిన అద్దె డబ్బులు మున్సిపల్‌ ఖాతాలో జమ కావడం లేదు. 2017 నుంచి పట్టణానికి చెందిన ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అధీనంలో ఈ షాపు ఉంది. ఆయన మాత్రం అద్దెను మున్సిపల్‌ అధికారులకు చెల్లించడం లేదని గురువారం వెలుగులోకి వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ షాపు అద్దె బాగోతం ఆలస్యంగా బయటపడింది. గత నెలలో మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం అజెండాలో 20వ నెంబరు షాపు ఖాళీగా వుందని అధికారులు చూపించారు.దీనిపై అనుమానం వచ్చిన వైసిపి కౌన్సిలర్లు గిరిరఘు, గొర్లి వెంకటరమణ, బి.శ్రీనివాసరావు, రాపాక మాధవరావు వైస్‌చైర్‌ పర్సన్‌ జర్జాపు దీప్తితో కలిసి గురువారం షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 20 నెంబర్‌ షాపును పరిశీలించారు. పట్టణానికి చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ పేరిట షాపు వున్నట్లు దానిపై వున్న బోర్డులో ఉంది. మున్సిపల్‌ ఆర్వో రాఘవాచార్యులు, ఆర్‌ఐ శ్రీనివాసరావుతో కలిసి వైస్‌ చైర్‌పర్సన్‌ జర్జాపు దీప్తి, కౌన్సిలర్లు షాపు వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆ షాపు బోర్డులో ఉన్న యజమానికి అధికారులు ఫోన్‌ చేసి వివరాలు అడిగారు. 2017 నుంచి తన అధీనంలో ఆ షాపు ఉందని యజమాని అయిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అధికారులకు చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. షాపు అద్దె ఎవరికి చెల్లిస్తున్నారని ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ను ప్రశ్నించగా చెల్లించలేదని ఆయన సమాధానం చెప్పారు. షాపు అద్దె వెంటనే చెల్లించాలని లేకపోతే పోలీసు కేసు పెడతామని అధికారులు హెచ్చరించారు. మున్సిపల్‌ అధికారులు ఆ షాపు కి ఇంకో తాళం వేసి నిష్క్రమించారు.నిద్రావస్థలో రెవెన్యూ అధికారులుమున్సిపల్‌ రెవెన్యూ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనడానికి ఈ వ్యవహారం చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే 2017 నుంచి షాపు అద్దె జమ చేయకుండా యజమాని తన అధీనంలో ఉంచుకున్నారంటే రెవెన్యూ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నది స్పష్టమవుతోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకవర్గం బాధ్యులు షాపును అనధికారికంగా ఆ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌కు ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020లో వైసిపి పాలకవర్గం పగ్గాలు చేపట్టింది. అప్పుడు కూడా రెవెన్యూ అధికారులు దీన్ని కనిపెట్టకుండా దాచిపెట్టి వుంచారు. ఇప్పటివరకు అధికారులకు తెలిసినా ఈ బాగోతం బయటపెట్టకుండా కౌన్సిల్‌ను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పాలకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి గుట్టుచప్పుడు కాకుండా ఆ షాపు అద్దె డబ్బును తన ఖాతాలో వేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.దీని వెనుక ఎవరున్నారో తేలాలి: వైస్‌ చైర్‌ పర్సన్‌ దీప్తి, కౌన్సిలర్లుమున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక షాపు అద్దెను దారి మళ్లిస్తూ ఖాళీగా ఉందని చూపుతున్న వ్యవహారం వెనుక ఎవరున్నారో తేలాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించాలి.

➡️