సంక్రాంతి వచ్చిందే తుమ్మెద

Jan 14,2024 20:48

పండగ అంటేనే సరదాలు.. సందళ్లు… అందులోనూ సంక్రాంతి అంటే తెలుగు వారింట చెప్పలేనంత అనుభూతి. స్నేహితులు, రక్త సంబంధీకుల అనురాగం. ఆప్యాయత పంచుకునే పర్వదినాలు. పండగకు కొద్దిరోజుల ముందు నుంచే పిండివంటకాలు ఘుమఘుమ లాడేవి. నూతన వస్త్రాలు, కిరాణా సామగ్రి తదితర సరుకుల క్రయ విక్రయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కళకళలాడేది. ఇదంతా ఒకప్పటి మాట. మారిన ప్రభుత్వ విధానాల వల్ల నేడా పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజానీకమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం సమస్యలతో సతమతమౌతూ పండగ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏటా సర్కారు జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేది. ఈసారి అది కూడా కానరాకపోవడంతో మునుపటితో పోలిస్తే సంక్రాంతి సందడి ఒకింత తగ్గిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి – కురుపాం : పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతికి నెలరోజుల ముందే…. అంటే నెలగంటు పెట్టినప్పటి నుంచీ రోజూ క్రమం తప్పకుండా ఇళ్లు అలుక్కోవడం (శుభ్రం చేసుకోవడం), సున్నాలు వేసి ప్రత్యేకంగా ముస్తాబు చేయడం వంటి పనులు ప్రారంభిస్తారు. మూడు రోజుల సంక్రాంతి సంబరం భాగంగా ఆదివారం భోగి వేడుకలతో ప్రారంభమైంది. సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ పండుగ నిర్వహించుకోనున్నారు. పండుగను సొంత ఊళ్లలో జరుపుకోవడానికి జనం పట్టణాలు వదిలి, కుటుంబా లతో పల్లెలకు చేరుకున్నారు. రెండు రోజులుగా పట్టణాల నుంచి కుటుంబ సభ్యుల రాకతో ప్రతి ఇల్లు సందడిగా మారింది. పిండివంటల ఘుమఘుమలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బిమ్మలు.. బసవ్వన్నలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేకశోభను సంతరించుకుంటున్నాయి. ఉత్తరాయన పుణ్య, కాలంలో మార్గశిర పుష్పమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలోకి మారుతూ ‘మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు. సంక్రాంతి ఎన్నెన్నో సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఆధునిక పోకడలతో పండుగల్లో కొంత కళ తగ్గిపోతున్నా రంగవల్లులు తీర్చిదిద్దడంలో మహిళలు మాత్రం పోటీ పడుతూనే ఉన్నారు. చిన్నారులు పతంగులతో సందడి చేస్తున్నారు. సంక్రాంతిలో భాగంగా ఇళ్ల ముందు వేసే ముగ్గుల్లో గొబ్బెమ్మలు ముఖ్యమైనవి. ఆవుపేడతో ముద్దలు చేసి ముగ్గుల మధ్యన పెట్టి పసుపు, కుంకుమ అద్ద పిండితో ముగ్గులు వేసి ఏర్పాటు చేస్తారు. ఈ గొబ్చెమ్మను గొరిదేవిగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారు. పసువు, కుంకుమ పెసరపప్పు, శెనగలు, మరమరాలు (పెలాం), అటుకులు మొదలైన వాటితో పూజలు చేసి పంచుకుంటారు. భోగితో సంక్రాంతిని స్వాగతిస్తారు. ప్రతి ఇంటి ముందు భోగిమంటలు వేస్తారు. పల్లెల్లో భోగి మంటల సంప్రదాయం ఇంకా ఉన్నా పట్టణాల్లో మాత్రం కనుమరుగైపోయింది. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆ మంటలతో కాగిన నీళ్లతో స్నానం చేస్తారు. ఈ స్నానాలతో దుష్టశక్తులు తొలగిపోయి సంతోషంగా ఉంటారని భావిస్తారు.భోగి పండ్లతో చిన్నారులకు ఆశీర్వాదం భోగిపండ్లు అంటే రేగు పండ్లు సూర్యుడి రూపం. రంగు పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలు కలిపి పిల్లలపై పోసి ఆశీర్వదిస్తాడు. పిల్లలు కూడా ఎంతో సంబరంగా వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం వేళ మహిళలు బొమ్మలకొలువు నిర్వహిస్తారు.నోరూరించే ఘుమఘుమలుసంక్రాంతి అంటేనే ముందుగా అందరికీ గుర్తొచేది పిండివంటలు, నోరూరించే ఘుమఘుమలు స్వాగతం పలుకుతాయి. ప్రతి ఇంటా పలురకాల పిండి వంటలను తయారు చేస్తారు. చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటారు. కనుమ రోజున నాటుకోళ్లు, గారెలు ప్రధాన పంటలుగా చేస్తారు.రద్దీగా బస్టాండ్‌, రైల్వే స్టేషన్లుపార్వతీపురం టౌన్‌ : జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టణ రైల్వే స్టేషన్‌కు వచ్చిన నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న అన్ని బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉపాధి, ఉద్యోగాల కోసం కుటుంబాలను, తల్లిదండ్రులను, రక్తసంబంధీకులను స్నేహితులను, సొంత ఊళ్లను వదిలి విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, వంటి మహానగరాలకు వెళ్లిన వారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దూరప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు చేరుకునేందుకు భోగి రోజున చేరుకున్నారు. దీంతో పట్టణ రైల్వేస్టేషన్‌లో అగిన నాగావళి ఎక్స్‌ ప్రెస్‌ నుండి అధిక సంఖ్యలో ప్రయాణికుల రైల్వే స్టేషన్లో దిగిన తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు బస్సులను, ఆటోలను ఆశ్రయించారు.

➡️