సంక్షేమ లబ్ధితో ఆర్థికాభివృద్ధి : ‘చింతల’

Jan 7,2024 21:26

ప్రజాశక్తి-వాల్మీకిపురం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చింతపర్తి, చారా వాండ్లపల్లిలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, ఆర్‌బికె కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం చింతపర్తి పురవీధుల్లో ఎపిఎండిసి డైరెక్టర్‌ హరీష్‌ రెడ్డితో కలసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, రానున్న ఎన్నికలలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ సిఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష వంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, మందులు అందిస్తున్నారన్నారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పౌరసేవలు అందిస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు అందజేయాలని కోరారు. మండలంలోని చారా వాండ్లపల్లికి చెందిన నరసింహులు, నాగరాజ, బాలాజీ, ఆదినారాయణ, లక్ష్మిదేవి ఎమ్మెల్యే వైసిపిలో చేరారు. వారికి ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి వైసిపి కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం మండలంలోని చింతపర్తిలో ఇళ్లు లేని నిరుపేదలకు 116మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అలాగే 50 మందికి అసైన్‌మెంట్‌ పట్టాలను అందజేశారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️