సంబరాలు సరే.. డబ్బులేవీ?

Feb 11,2024 20:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళలను మహారాణులను చేస్తామంటూ.. వైఎస్‌ఆర్‌ ఆసరా పేరుతో బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ.. నాలుగు విడతల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2019 ఏప్రిల్‌ 17వ తేదీ వరకు స్వయం సహాయ సంఘాలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులో తీసుకున్న రుణాన్ని నాలుగు విడతలకు గాను మూడుసార్లు బ్యాంకుల్లో నగదు జమచేశారు. జగన్‌ ప్రభుత్వం హామీ మేరకు నాలుగో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా కింద నిధులను గత నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా బటన్‌ నొక్కి, విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు జిల్లాల వారీగా మంత్రులు స్వయం సహాయక సంఘాల మహిళలకు మెగా చెక్కులు అందజేశారు. అనంతరం మండలాల వారీగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సభలు ఏర్పాటు చేసి, చెక్కులు పంపిణీ చేశారు. నాటి నుంచి నేటి వరకు స్వయం సహాయక సంఘాల మహిళలు ఆసరా డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.20 రోజులైనా..వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంలో భాగంగా నాలుగో విడతలో జిల్లాలో 36,507 సంఘాల పరిధిలోని 4,04,031 మంది డ్వాక్రా మహిళలకు రూ.252.31 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళల వ్యక్తిగత ఖాతాల్లో ఆ డబ్బులు జమచేస్తున్నట్లు జనవరి 23న బటన్‌ నొక్కారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేశారంటూ గొప్పలు చెప్పుకున్నారు. డబ్బులు మాత్రం మహిళల ఖాతాల్లో జమకాక స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆసరా పేరిట ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పొందేందుకు బ్యాంకు వరకు వచ్చే పోయేందుకు మూణ్నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అక్కచెల్లెమ్మలు వాపోతున్నారు. విజయనగరం లో 3406 డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న 33,383 మందికి, నాలుగో విడత రుణమాఫీ కింద రూ.25.8 కోట్లు విడుదల కావాల్సి ఉంది. నేటికీ 20 శాతం దాటి రాలేదని సంఘాల మహిళలు వాపోతున్నారు దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే ప్రభుత్వ రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారా? లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

➡️