సచివాలయ సిబ్బందికి ‘ఆట’విడుపు

Dec 21,2023 22:08
లబ్దిదారుల సంఘీభావం

సచివాలయ సిబ్బందికి ‘ఆట’విడుపుప్రజాశక్తి – శ్రీకాళహస్తితమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత పది రోజులుగా ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి సచివాలయ ఉద్యోగుల చేతుల్లో పెట్టినా అంగన్వాడీలు వెనక్కు తగ్గని పరిస్థితి. అదే రీతిన రాష్ట్ర ప్రభుత్వమూ అంగన్వాడీల సమస్యలను పట్టించుకోకపోగా, సమ్మెను నిర్వీర్యం చేసే ధోరణిలో సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీలపై ఉసిగొలిపి వేడుక చూసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఆ రెండు శాఖల ఉద్యోగుల్లో సంఘర్షణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల తీరుపై చాలాచోట్ల అంగన్వాడీలు తిరగబడ్డారు. ఏ ఏ అంగన్వాడి కేంద్రాల్లో ఎవరెవరు సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారో వారిపై కేసులు పెట్టేందుకు అంగన్వాడీలు సమాయత్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీలకు అండగా నిలబడుతున్నారు. అయితే గత ఐదు రోజులుగా సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నా ఎక్కడా భోజనం వండి చిన్నారులకు వడ్డించిన దాఖలాలు కనిపించడం లేదు. ఓ రకంగా సచివాలయ సిబ్బందికి ఆటవిడుపుగా ఈ విధులు ఉన్నాయి. గుర్రం చేయాల్సిన పని గుర్రం, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలని, ఈ ప్రభుత్వ హయాంలో అంతా ‘రివర్స్‌గేర్‌’గా ఉందని లబ్దిదారులు మండిపడుతున్నారు. అలా వచ్చి..ఇలా పోతున్నారు శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ శాఖ పరిధిలో 207 అంగన్వాడి కేంద్రాలను నడుపుతున్నారు. ఈ కేంద్రాల్లో 3 వేల పైచిలుకు ప్రీ స్కూల్‌ విద్యార్థులు, 2500 పై చిలుకు బాలింతలు, గర్భవతులు, కిశోర బాలికలు పౌష్టికాహారం పొందుతున్నారు. వీళ్ళ ఆలనా పాలనా గత 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ కార్యకర్తలు చూసుకుంటూ వస్తున్నారు. అయితే అంగన్వాడీ డిమాండ్ల సాధన పై ప్రభుత్వం, అంగన్వాడీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం అంగన్వాడీలకు సమాంతరంగా కేంద్రాలను నడిపే బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పింది. వీరంతా ఈనెల 18వ తేదీ నుంచి అంగన్వాడి కేంద్రాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఏ కేంద్రానికి వెళ్లినా ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అక్కడ చిన్నారులు గానీ, గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు కాన రావడం లేదు. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలకు టేక్‌ హోమ్‌ రేషన్‌ పద్ధతిలో పౌష్టికాహారం ఇంటికే అందుతోన్న నేపథ్యంలో కనీసం చిన్నారులు కూడా కేంద్రాల్లో కనిపించడం లేదు. సాధారణంగా అంగన్వాడి కేంద్రాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సచివాలయ ఉద్యోగులు మాత్రం ఉదయం 9 గంటలకే కార్యాలయం తెరిచి మధ్యాహ్నం 12 గంటలకు మూసేస్తున్నారు. ‘ప్రజాశక్తి’ పరిశీలనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని దర్గా మిట్ట, కొత్తపేట ఆర్టీసీ బస్టాండ్‌ అంగన్వాడి కేంద్రాలను గురువారం తనిఖీ చేసింది. ఈ రెండు కేంద్రాల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే దర్శనమివ్వడం గమనార్హం.అంగన్వాడీలే నిర్వహించాలి: నవనీతమ్మ, కొత్తపేట గత ఐదు రోజులుగా మా వీధిలో సచివాలయు ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రం నడుపుతున్నారు. అయితే కేంద్రాలకు వెళ్లేందుకు మా పిల్లలు వెనకడుగు వేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇలా వచ్చామా..అలా వెళ్ళామా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వారికి ఎంత మంది పిల్లలు ఆ కేంద్రాల్లో చదువుతున్నారో కూడా తెలియదు. అలాంటివారు కేంద్రాలను ఎలా నడుపుతారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరించి కేంద్రాల నిర్వహణ వారికే అప్పజెప్పాలి.పుత్తూరులో లబ్దిదారుల సంఘీభావం పుత్తూరులో అంగన్‌వాడీల సమ్మెకు పిల్లల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ సమ్మెకు లబ్దిదారులు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఉండేటపుడు పిల్లలను బాగా చూసుకునేవారని, బోజనం బాగా పెట్టేవారని, సచివాలయ ఆఫీసు ద్వారా పిల్లలకు సరైన భోజనం అందడం లేదన్నారు. మునికుమారి, విజరుకుమారి, ధనమ్మ, రాధ, పద్మజ, లలిత, హైమావతి, లక్ష్మీ, అన్నపూర్ణ, గంగులమ్మ, జయంతి పాల్గొన్నారు. టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ పదివేల రూపాయల ఆర్థిక సాయం అంగన్‌వాడీల సంఘీభావనిధిగా అందించారు.టిడిపి నాయకులు గంజి మాధవయ్య, జి.జీవరత్నంనాయుడు, డి.రవికుమార్‌ పాల్గొన్నారుపుత్తూరులో లబ్దిదారుల సంఘీభావం

➡️