సబ్‌జైలు భూములపైపె(గె)ద్దల కన్ను

Mar 8,2024 20:49

  ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కొండగంగుపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే -1లో 200 ఎకరాల డి-పట్టా భూముల్లో ఓపెన్‌ సబ్‌ జైలు ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో భూమిని సేకరించింది. ఈ భూములను అంతకు ముందే గిరిజనులకు ఇచ్చిన ప్రభుత్వం తిరిగి వారి వద్ద నుంచి తీసుకుని సబ్‌జైలుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఇందుకోసం భూమి అభివృద్ధి చేసేందుకు అక్షరాలా రూ.కోటి ఖర్చు పెట్టి చదును చేసింది. ఇంత చేసిన ప్రభుత్వం చివరికి ఆ భూముల్లో సబ్‌ జైలు నిర్మించలేదు. తిరిగి ఆ భూములను గిరిజనులకు కూడా ఇవ్వలేదు. దీంతో కొంత మంది కబ్జాదారుల కన్ను ఆ భూములపై పడింది. విశాఖ జిల్లాకు చెందిన కొంది మంది రాజకీయ పలుకుబడి ఉన్న కబ్జాదారులు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి డి-పట్టా భూములను వారి పేరుపై మార్చుకుని అమ్ముకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి కొందిమంది గతంలో పట్టాలిచ్చిన గిరిజనుల వద్దకు వెళ్లి ఎవరైనా అధికారులు వస్తే ఈ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పాలని దళారుల అవతారమెత్తిన కబ్జాదారులు గిరిజనులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులు కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇక ప్రభుత్వ భూములను కాపాడేది ఎవరంటూ ఆ ప్రాంతంలో కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కె.జి.పూడిలో ప్రభుత్వ భూములు మాయాజాలంపై స్వయంగా జిల్లా కలెక్టర్‌ స్పందించి సర్వే చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని వాదన వినిపిస్తుంది. సబ్‌జైలు నిర్మాణం జరగకపోతే ఆ భూములను తిరిగి నిజమైన గిరిజనులకు ఇవ్వాలన్న డిమాండ్‌ పెద్దఎత్తున వినిపిస్తోంది.

➡️