సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆగ్రహం

Dec 28,2023 21:23

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: సమ్మెలో ఉన్న కారణంగా కెజిబివి సిబ్బందికి అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం పట్ల సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. ఈ మేరకు జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగులు షోకాజ్‌ నోటీసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పార్వతీపురం చర్చి జంక్షన్‌లో నోటీసు ప్రతులను దగ్ధం చేసి నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు భారతి, ఈశ్వరరావు, లక్ష్మణరావు, బివి రమణ మాట్లాడుతూ జిల్లాలో 59 మంది కెజిబివి ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులను జిల్లా అధికారులు ఇచ్చారని, ఇది ఉద్యోగులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు గతంలో ఇచ్చిన జిఒను కూడా నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. కెజిబివి సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి భయభ్రాంతులకు గురిచేసే దుర్మార్గమైన చర్యలను ఉపంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతానికి పోకుండా సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి నాయకులు రమేష్‌, భానుప్రకాశ్‌, సింహాచలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.

➡️